బుమ్రా సార‌థ్యంలో భార‌త్‌.. నేటి నుంచే ఐదో టెస్టు

India vs England 5th Test Jasprit Bumrah set for captaincy challenge.బ‌ర్మింగ్‌హామ్‌లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2022 8:36 AM GMT
బుమ్రా సార‌థ్యంలో భార‌త్‌.. నేటి నుంచే ఐదో టెస్టు

బ‌ర్మింగ్‌హామ్‌లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరాటానికి రంగం సిద్ద‌మైంది. బుమ్రా సార‌థ్యంలో టీమ్ఇండియా అతిథ్య ఇంగ్లాండ్‌ను ఢీ కొట్ట‌నుంది. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా ఈ టెస్టు మ్యాచ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు, సారథులు మారిపోగా.. సిరీస్‌ పట్టాలని టీమ్‌ఇండియా, సమం చేయాలని ఇంగ్లాండ్‌లు తహతహలాడుతున్నాయి.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్ప‌టికే భార‌త్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్‌ను భార‌త్ డ్రా చేసుకున్నా సిరీస్‌ భార‌త్ సొంతం. అయితే.. ఇటీవ‌ల కొత్త సార‌ధి బెన్ స్టోక్స్ నాయ‌క‌త్వంలోని ఇంగ్లాండ్ జ‌ట్టు టెస్టు ఛాంపియ‌న్ కివీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసి జోరుమీదుంది. రోహిత్‌, రాహుల్‌, ర‌హానే వంటి సీనియ‌ర్లు దూర‌మైన నేప‌థ్యంలో భార‌త్ ఎలా ఆడుతుంద‌న్న‌దే అస‌లు ప్ర‌శ్న‌.

రోహిత్‌ శర్మ కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్‌కు పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. హర్యానా హరికేన్‌ కపిల్‌దేవ్‌ తర్వాత భారత జట్టు పగ్గాలు అందుకున్న తొలి పేస్‌ బౌలర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఇక మ్యాచ్ ఆరంభానికి ఒక రోజు ముందే ఇంగ్లాండ్ తుది జ‌ట్టును ప్ర‌క‌టించ‌గా.. గ‌తేడాది జ‌రిగిన నాలుగో టెస్టులో ఆడిన ఆట‌గాళ్ల‌లో కేవ‌లం న‌లుగురు ప్లేయ‌ర్లు మాత్ర‌మే ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టులో ఉన్నారు.

కెప్టెన్సీ వ‌దులుకున్న కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బందులు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు సెంచ‌రీ చేయ‌కున్నా మ్యాచ్ విన్నింగ్స్ ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆశిస్తున్నాడు. యువ ఆట‌గాళ్లు శ్రేయస్ అయ్య‌ర్‌, గిల్‌, విహారి, మ‌యాంక్ వంటి ఆట‌గాళ్లు ఎలా రాణిస్తున్నారు అన్నదానిపైనే టీమ్ఇండియా విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో తొలి రెండు రోజుల ఆట‌కు వ‌రుణుడి వ‌ల్ల ఆటంకాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. మూడో రోజు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. సాధార‌ణంగా ఇక్క‌డి పిచ్ పేస‌ర్ల‌కు అనుకూలం. అయిన‌ప్ప‌టికీ బ్యాట్స్‌మెన్లు నిల‌దొక్కుకుంటే భారీ స్కోర్లు సాధించ‌వ‌చ్చు. కాగా.. ఇక్క‌డ భార‌త్ ఏడు మ్యాచులు ఆడ‌గా.. ఆరింటిలో ఓట‌మిపాలు కాగా.. ఒక‌టి డ్రా చేసుకుంది.

Next Story
Share it