టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బుమ్రా.. ఒకే ఓవర్‌లో 35 పరుగులు
India vs England 5th Test Bumrah leads charge as ENG slump to 84/5.బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వగానే చాలా మంది పెదవి
By తోట వంశీ కుమార్ Published on 3 July 2022 8:08 AM ISTబుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వగానే చాలా మంది పెదవి విరిచారు. మాజీ క్రికెటర్లు సైతం ఇది అతడి ఆటపై నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషణలు చేశారు. అయితే.. వాటి అన్నింటికి బుమ్రా తన ఆట తీరుతోనే సమాధానం చెప్పాడు. కెప్టెన్సీ తనకు భారం కాదని, తనలోని పూర్తి సామర్థ్యాన్ని అది బయటకు తీసుకువస్తుందని రెండో రోజు నిరూపించాడు. తొలుత బ్యాటింగ్‌లో చరిత్ర సృష్టించిన బుమ్రా.. అనంతరం బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి టీమ్ఇండియా పై చేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 85/5 స్కోరుతో నిలిచింది. బెయిర్ స్టో(12), స్టోక్స్(0) క్రీజులో ఉన్నారు.
అంతకముందు ఓవర్ నైట్ స్కోర్ 338/7 తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 78 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. 83 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన జడేజా(104; 194 బంతుల్లో 3 ఫోర్లు) తొలి రోజు జోరును చూపిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో షమీ (16) అతడికి చక్కని సహకారం అందించాడు. వీరిద్దరు ఆట ప్రారంభమైన గంట వరకు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అనంతరం బ్రాడ్ బౌలింగ్ లో షమి థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడి ఔటైయ్యాడు. కాసేపటి శతక వీరుడు జడేజాను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. అప్పటికి భారత్ స్కోర్ 375/ 9. ఇక భారత ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టదని అనిపించింది.
చెలరేగిన బుమ్రా.. ఒకే ఓవర్‌లో 35 పరుగులు
ఈ దశలో కెప్టెన్ బుమ్రా( 31 నాటౌట్; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి పోయాడు. బ్రాడ్‌కు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో బుమ్రా ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. ఇందులో 29 రన్స్ బ్యాట్ నుంచి రాగా.. మిగిలిన ఆరు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. తొలి బంతికి బుమ్రా ఫోర్ కొట్టగా.. రెండో బంతి వైడ్, బైస్ కలిపి 5 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి బంతి నోబాల్ కాగా.. దాన్ని బుమ్రా సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఒక్క బంతి పూర్తి అయ్యే సరికి 16 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బుమ్రా వరుసగా 4,4,4,6 బాదాడు. చివరి బంతికి సింగిల్ తీశాడు. ఇలా ఆ ఓవర్‌లో ఎక్స్‌ట్రాలతో కలిపి 35 పరుగులు వచ్చాయి. దీంతో టెస్టు క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బుమ్రా రికార్డు సృష్టించాడు. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా (28 పరుగులు) 18 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. కాగా.. బ్రాడ్ బౌలింగ్‌లోనే యువరాజ్ సింగ్ 2007 టి20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే.
బుమ్రా ధాటికి భారత్ 400 పరుగులు దాటింది. ఆ తరువాతి ఓవర్‌లోనే సిరాజ్‌ను అండర్సన్ ఔట్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. లీస్ (6), క్రాలీ (9), పోప్ (10), లీచ్ (0) విఫలం కాగా.. రూట్ (31) కాస్త పోరాడాడు. భారత బౌలర్లలో బుమ్రా 3, షమీ, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 5 వికెట్లు ఉన్న ఇంగ్లాండ్ ఇంకా 332 పరుగులు వెనుకబడి ఉంది. రెండు రోజు ఆటకు వరుణుడు పలు మార్లు అంతరాయం కలిగించడంతో 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మూడవ రోజు స్టోక్స్, బెయిర్ స్టోను సాధ్యమైనంత త్వరగా పెవిలియన్ చేరిస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ పట్టు సాధించినట్లే.