బంగ్లాతో భారత్ కీలక పోరు.. సెమీస్ లక్ష్యంగా బరిలోకి రోహిత్ సేన
India vs Bangladesh T20 world cup match today.అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.
By తోట వంశీ కుమార్ Published on 2 Nov 2022 9:39 AM ISTఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో నేడు(బుధవారం) మరో పోరుకు సిద్దమైంది టీమ్ఇండియా. అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే ఓడిన జట్టు సెమీస్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఏ మాత్రం ఉదాసీనతకు తావు ఇవ్వకూడదు. బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి సెమీస్‌కు మార్గం సుగమమం చేసుకోవాలని సగటు భారత క్రీడాభిమాని కోరుకుంటున్నాడు.
ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో చిన్న జట్లను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. పసికూన స్కాట్లాండ్ దెబ్బకు వెస్టిండీస్ సూపర్-12 దశకు చేరకుండానే వెనుదిరగగా.. గ్రూప్ దశలో శ్రీలంకకు నమీబియా షాకిచ్చింది. ఇక సూపర్-12లో ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్, పాకిస్థాన్‌కు జింబాబ్వే కంగుతినిపించాయి. పసికూన ముద్రను చెరిపివేసుకుని పెద్ద జట్లను ఓడించడం అలవాటుగా మార్చుకున్న బంగ్లాదేశ్‌తో రోహిత్‌సేన జాగ్రత్తగా ఉండాల్సిందే. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా విజయం సాధించిన విషయాన్ని కూడా మరువరాదు.
టీమ్ఇండియాను ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఫామ్ కలవరపెడుతోంది. సింగిల్ డిజిట్ లకే పరిమితం అవుతున్నా జట్టు మేనేజ్‌మెంట్ అతడికి అండగా ఉంటూ వస్తోంది. మరో ఓపెనర్ అందుబాటులో లేకపోవడం కూడా రాహుల్‌కి కలిసివస్తోంది. దీంతో అతడి స్థానానికి ఢోకా లేదు. ఆడిన మూడు మ్యాచుల్లో విఫలం అయిన రాహుల్ బంగ్లాతో మ్యాచులోనైనా విజృంభిస్తాడో లేదో చూడాలి.
ఇక రిషబ్‌పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు. వారి కోరిక నేడు తీరే అవకాశం ఉంది. గాయం కారణంగా దినేశ్‌కార్తిక్ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానమే. దీంతో అతడి స్థానంలో పంత్ తుది జట్టులోకి రావచ్చు. రోహిత్, కోహ్లీల నుంచి నిలకడ కోరుకుంటున్న మేనేజ్‌మెంట్ మరోసారి సూర్యకుమార్ మెరుపులు మెరిపించాలని ఆశిస్తోంది. బౌలింగ్ విషయానికొస్తే భువనేశ్వర్, అర్ష్‌దీప్‌సింగ్, షమీతో కూడిన పేస్ త్రయం అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తోంది. అయితే.. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మాత్రం నిరాశపరుస్తున్నాడు. అతడి స్థానంలో చాహల్‌కు ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైన టీమ్ఇండియా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. ఫీల్డింగ్ మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.
తస్కిన్ సూపర్‌ఫామ్
అటు బంగ్లాదేశ్ సమిష్టి కృషితో దూసుకువెలుతోంది. బంగ్లా పేసర్ తస్కిన్ అహ్మద్ సూపర్‌ఫామ్ లో ఉన్నాడు. స్వింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఆల్‌రౌండర్, కెప్టెన్ షకిబ్ ఆ జట్టుకు అతి పెద్ద బలం, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్ లతో కూడిన బ్యాటింగ్ విభాగం కాస్త పటిష్టంగానే కనిపిస్తోంది.
పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం
ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమ్ఇండియా మూడు మ్యాచ్‌లు ఆడగా.. బౌలింగ్‌కు సహకరించే పిచ్‌ల మీదే ఆడింది. అయితే.. అడిలైట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు కొంతమేర ఉంది.