ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. బంగ్లాదేశ్‌కు దక్కని శుభారంభం
భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. ఈరోజు ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది
By Medi Samrat Published on 20 Sept 2024 12:15 PM ISTభారత జట్టు తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. ఈరోజు ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత జట్టు శుక్రవారం ఒక్క గంట ఆటకే పరిమితమైంది. రెండో రోజు రవీంద్ర జడేజా రూపంలో భారత్‌కు తొలి దెబ్బ తగిలింది. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి చిక్కాడు. జడేజా 86 పరుగులు చేశాడు. జడేజా అశ్విన్‌తో కలిసి ఏడో వికెట్‌కు 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీని తర్వాత తస్కిన్ ఆకాష్ దీప్‌ను అవుట్ చేశాడు. ఆకాష్ 17 పరుగులు చేసి ఎనిమిదో వికెట్‌కు అశ్విన్‌తో కలిసి 24 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆపై తస్కిన్ బౌలింగ్‌లోనే అశ్విన్ కూడా షాంటోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ 113 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతడికిది ఆరో సెంచరీ. బుమ్రా ఏడు పరుగులు చేసిన తర్వాత హసన్ మహమూద్‌కు బలి అయ్యాడు. హసన్ గురువారం నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా వికెట్‌తో అతను ఐదు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. హసన్ వరుసగా రెండు టెస్టుల్లో ఐదు వికెట్లు తీశాడు. భారత్‌తో భారత్‌తో జరిగిన టెస్టులో ఐదు వికెట్లు తీసిన తొలి బంగ్లాదేశ్ బౌలర్. తస్కిన్ మూడు వికెట్లు తీశాడు. నహిద్ రాణా, మెహదీ హసన్ మిరాజ్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు గురువారం భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ ఆరు పరుగులు, విరాట్ కోహ్లి ఆరు పరుగుల వద్ద ఔటయ్యారు. శుభ్‌మన్ గిల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్‌తో కలిసి యశస్వి జైస్వాల్ నాలుగో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 39 పరుగుల వద్ద పంత్ ఔటయ్యాడు. కాగా, యశస్వి 56 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ మళ్లీ ఫ్లాప్ అయ్యి 16 పరుగులు మాత్రమే చేశాడు.
ఆ తర్వాత రెండో రోజు లంచ్ సమయానికి బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగియగా.. బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే షాద్‌మన్ ఇస్లాంను క్లీన్ బౌల్డ్ చేసి షాక్ ఇచ్చాడు. అతను రెండు పరుగులు మాత్రము చేశాడు.
దీని తర్వాత ఆకాశ్ దీప్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో అంటే లంచ్‌కు ముందు జకీర్ హసన్, మోమినుల్ హక్‌లను వరుసగా రెండు బంతుల్లో అవుట్ చేశాడు. తొమ్మిదో ఓవర్ తొలి బంతికి జకీర్‌ను, రెండో బంతికి మోమినుల్‌ను ఆకాష్ క్లీన్ బౌల్డ్ చేశాడు. జకీర్ మూడు పరుగులు చేయగా.. మోమినుల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ప్రస్తుతం కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 15 పరుగులతో.. ముష్ఫికర్ రహీమ్ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నారు.