బంగ్లాతో వన్డే వార్.. సీనియర్లు ఫామ్‌లోకి వచ్చేనా..?
India vs Bangladesh 1st ODI today.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్-బంగ్లాదేశ్‌లు తొలి వన్డేలో
By తోట వంశీ కుమార్ Published on 4 Dec 2022 8:11 AM ISTటీ20 ప్రపంచకప్ ముగిసింది. ఇక అందరి దృష్టి వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ పైనే ఉంది. ఇందుకోసం అన్ని జట్లు తమ అస్త్రాలను సిద్దం చేసుకునే పనిలో ఉన్నాయి. ఇక భారత జట్టు బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియం వేదికగా భారత్-బంగ్లాదేశ్‌లు తొలి వన్డేలో తలపడనున్నాయి. కివీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకున్న సీనియర్లు రోహిత్, కోహ్లీ, రాహుల్ ల చేరికతో టీమ్ఇండియా బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతమైంది. ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలం అయిన రోహిత్, రాహుల్ కనీసం ఈ సిరీస్‌తోనైనా ఫామ్ అందుకుంటారో లేదో చూడాలి.
గత కొంతకాలంగా టీ20లకు ధావన్‌ను పక్కన పెట్టి కేవలం వన్డేల్లో మాత్రమే ఆడిస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌కు అతడిని కీలక ఆటగాడిగా టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది. దీంతో రోహిత్ తో కలిసి ధావన్ ను ఓపెనర్‌గా పంపే అవకాశం ఉంది. ఇక బంగ్లాపై తిరుగులేని రికార్డు ఉన్న కోహ్లీ వన్‌డౌన్ లో ఆడనున్నాడు. అతడు తన ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. నాలుగులో శ్రేయస్ అయ్యర్ ఆడొచ్చు.
రెగ్యులర్‌గా ఓపెనర్‌గా ఆడే రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఆడే అవకాశం ఉంది. వరుసగా విఫలం అవుతున్నప్పటికీ పంత్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. రోహిత్, ధావన్, కేఎల్ రాహుల్ లు ఈ మ్యాచ్‌లో సత్తా చాటి తమపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. సీనియర్ బౌలర్లు షమీ, బుమ్రా లేకపోవడంతో పేస్ విభాగంలో అనుభవలేమీ సమస్యగా కనిపిస్తోంది. శార్దూల్, సిరాజ్, దీపక్ చాహర్ లు ప్రత్యర్థిని ఎంత వరకు కట్టడి చేస్తారో చూడాలి. కివీస్ పర్యటనలో సత్తా చాటిన సుందర్‌కు తోడు అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు.
గత కొన్నాళ్లుగా క్రమంగా ఎదుగుతూ పెద్ద జట్లను తరచుగా ఓడిస్తున్న బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. కెప్టెన్ తమీమ్‌తో పాటు పేసర్ తస్కిన్ గాయాలతో దూరం అయినప్పటికీ లిటన్ దాస్, షకీబ్, మహ్మదుల్లా, ముష్పికర్ వంటి అనుభవజ్ఞులు ఆ జట్టులో ఉన్నారు. సొంత గడ్డపై బంగ్లాను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. 2015 బంగ్లా పర్యటనలో టీమ్ఇండియా 1-2తో అనూహ్య పరాభవం చవిచూసిన సంగతి తెలిసిందే.