గులాబీ స‌మ‌రం నేడే.. జ‌డేజాకు ద‌క్క‌ని చోటు

India vs Australia Test Series Starts From Today. వ‌న్డే సిరీస్‌ను ఆసీస్ 2-1తో గెలువ‌గా.. టీ20 సిరీస్‌ను భార‌త్ 2-1తో

By Medi Samrat  Published on  17 Dec 2020 4:36 AM GMT
గులాబీ స‌మ‌రం నేడే.. జ‌డేజాకు ద‌క్క‌ని చోటు

వ‌న్డే సిరీస్‌ను ఆసీస్ 2-1తో గెలువ‌గా.. టీ20 సిరీస్‌ను భార‌త్ 2-1తో గెలిచి లెక్క స‌రిచేసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి టెస్టు సిరీస్‌పై ప‌డింది. నాలుగు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండియా-ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో బోణి కొట్టాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి. ముఖ్యంగా భార‌త్ విజ‌యం సాధించ‌డం ఎంతో ముఖ్యం. తొలి మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ కోహ్లీ దూర‌మ‌వుతుండ‌డంతో.. ఈ మ్యాచ్‌లో గెల‌వాల‌ని భార‌త్ భావిస్తోంది.

సిరీస్‌తో తొలి మ్యాచ్ గులాబి బంతితో జ‌ర‌గ‌నుండ‌డం విశేషం. ఇది ఆసీస్‌కు లాభం కానుంద‌ని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఒక‌వేళ భార‌త ఆట‌గాళ్లు సామ‌ర్థ్యం మేర‌కు రాణిస్తే.. గెలుపు బావుట ఎగుర‌వేయ‌డం టీమ్ఇండియాకు పెద్ద క‌ష్టం కాక‌పోవ‌చ్చు. ఇక మ్యాచ్‌కు రోజు ముందే భారత మేనేజ్‌మెంట్‌ ఆశ్చర్యకరంగా తుది జట్టును ప్రకటించింది. రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలోనూ ఆకట్టుకోలేకపోయిన పృథ్వీ షాకు మయాంక్‌తో జతగా ఓపెనింగ్‌ చేసే అవకాశం దక్కడం విశేషం. తాజా ఫామ్‌ ప్రకారం శుబ్‌మన్‌ గిల్‌ అరంగేట్రం చేయవచ్చని భావించినా పృథ్వీపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకముంచింది. అదే విధంగా బ్యాటింగ్‌లో పంత్‌దే పైచేయిగా ఉన్నా వికెట్‌ కీపింగ్‌లో తిరుగులేని సాహాకే జట్టు ఓటేసింది. నిల‌క‌డ లేమి, వికెట్ కీపింగ్‌లో త‌డ‌బాటు అత‌డికి చేటు చేసిన‌ట్లున్నాయి. హ‌నుమ విహారి, సాహాలు ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేయ‌నున్నారు. డే నైట్ టెస్టుల్లో పేస‌ర్లు హ‌వాను దృష్టిలో పెట్టుకుని న‌లుగురు పేసర్ల‌ను ఎంచుకుంటార‌న్న అంచనాలు కూడా త‌ప్పాయి. స్పిన్న‌ర్ అశ్విన్ ను తీసుకున్నారు. సీనియర్‌ ఇషాంత్‌ శర్మ లేకపోవడంతో ఊహించినట్లుగా షమీ, బుమ్రా, ఉమేశ్‌లతో భారత పేస్‌ దళం బరిలోకి దిగుతోంది.

ఇక ఆస్ట్రేలియా జట్టును గాయాలు వేదిస్తున్నాయి. విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, యువ ఓపెన‌ర్ ప‌కోస్కీ ఇద్ద‌రూ అందుబాటులో లేరు. దీంతో బ‌ర్న్స్ జ‌త‌గా మాథ్యూవేడ్ ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే.. బ‌ర్న్స్ ప్ర‌స్తుత ఫామ్ ఆస్ట్రేలియాకు ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే.. ఓపెన‌ర్ల సంగ‌తి ఎలా ఉన్నా.. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చే స్టీవ్ స్మిత్ తో పాటు ల‌బుషేన్

అల‌వోక‌గా భారీ ఇన్నింగ్స్‌లు ఆడ‌గ‌ల‌రు. వీరిద్ద‌రిని ఎంత త్వ‌ర‌గా పెవిలియ‌న్‌కు చేరిస్తే.. భార‌త విజ‌యావ‌కాశాలు అంత మెరుగు అవుతాయి. ఇక మిచెల్ స్టార్క్ నేతృత్వంలోని ఆసీస్ పేస్ ద‌ళం చాలా బ‌లంగా ఉంది. స్టార్క్ కు తోడు కమిన్స్, హాజల్‌వుడ్‌ల్లో ఏ ఇద్ద‌రు రాణించినా.. భార‌త్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు.

భారత్‌ (తుది జట్టు) : కోహ్లి (కెప్టెన్‌), మయాంక్, పృథ్వీ షా, పుజారా, రహానే, విహారి, సాహా, అశ్విన్, షమీ, ఉమేశ్, బుమ్రా.

ఆస్ట్రేలియా (అంచనా): పైన్‌ (కెప్టెన్‌), బర్న్స్, వేడ్, లబ్‌షేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్‌.


Next Story
Share it