అశ్విన్ మాయ.. ఆసీస్ విలవిల.. భారత్‌కు కీలక ఆధిక్యం
India vs Australia Live Score, 1st Test Day 2. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు
By Medi Samrat Published on 18 Dec 2020 11:52 AM GMTఅడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 191 పరుగులకే కట్టడి చేశారు. బౌలర్ల హవా సాగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు 53 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ నడ్డి విరచగా.. ఉమేష్ యాదవ్ మూడు, బుమ్రా రెండు వికెట్లు పడగొట్టారు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
రెండో రోజు ఆట ప్రారంభమైన 23 నిమిషాల్లో భారత ఇన్నింగ్స్‌ను ముగించి ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. విధ్వంసకర ఓపెనర్ వార్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అనుభవం లేని ఆసీస్ ఓపెనింగ్‌ను జంటను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. బర్న్, మాథ్యూ వేడ్ చెరో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. దీంతో ఆసీస్ 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ రెండు వికెట్లను బుమ్రానే పడగొట్టాడు. ఆ తరువాత అశ్విన్ మాయ మొదలైంది. వన్డే సిరీస్‌లో భారత్‌కు అడ్డుగోడగా నిలిచిన స్టీవ్‌స్మిత్(1), హెడ్(7), గ్రీన్ (11) లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 79 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓ వైపు వికెట్లు పడుతున్న ఒంటరి పోరాటం చేస్తున్న లబుషేన్ (47)కు కెప్టెన్ టీమ్ ఫైన్ (73*) జత కలిశాడు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని ఉమేశ్ యాదవ్ విడగొట్టాడు. 47 పరుగులు చేసిన లబుషేన్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆసీస్ టెయిల్ ఎండర్లతో కలిసి కెప్టెన్ టీమ్ పైన్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. స్టార్క్(15)తో 28 పరుగులు, లైయన్ (10) తో 28 పరుగులు, హెజిల్ వుడ్(8)తో కలిసి చివరి వికెట్ కు 24 పరుగుల కీలక భాగస్వాములు నెలకొల్పాడు. ఈ క్రమంలో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. హెజిల్‌వుడ్ ను ఉమేశ్‌యాదవ్ ఔట్ చేయడంతో 191 పరుగుల వద్ద ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసంది. టీమ్‌పైన్ నాటౌట్ గా మిగిలాడు. భారత్‌కు కీలకమైన 53 పరుగుల ఆధిక్యం దక్కింది.