నిలిచేనా..? అప్ప‌గించేనా..?

India vs Australia 2nd ODI. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం రెండో వ‌న్డేలో భార‌త్-ఆస్ట్రేలియా జ‌ట్లు

By Medi Samrat  Published on  28 Nov 2020 5:05 PM GMT
నిలిచేనా..? అప్ప‌గించేనా..?

మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం రెండో వ‌న్డేలో భార‌త్-ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. తొలి వ‌న్డేలో గెలుపు ఇచ్చిన ఉత్సాహాంతో ఆసీస్ బ‌రిలోకి దిగుతుండ‌గా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ స‌మం చేయాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌గా ఉంది. తొలి మ్యాచ్ జ‌రిగిన సిడ్ని మైదానంలోనే రెండో మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌డంతో.. మ‌రోసారి భారీ స్కోర్లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.

తొలి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో భార‌త్ విఫ‌ల‌మైంది. బౌలింగ్‌లో పోటీ ప‌డి మ‌రీ బౌల‌ర్లు ప‌రుగులు ఇవ్వ‌గా.. బ్యాటింగ్‌లో శిఖ‌ర్‌, పాండ్య మిన‌హా అంద‌రూ దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఇక ఫీల్డింగ్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. నిన్న వ‌ర‌కు ఐపీఎల్ ఆడిన భార‌త క్రికెట‌ర్లు ఇంకా.. ఆ ఫార్మాట్ నుంచి బ‌య‌టికి రాన‌ట్లు అనిపిస్తోంది. వ‌చ్చి రాగానే భారీ షాట్ల‌కు య‌త్నించి పెవిలియ‌న్ చేరారు. వారు ఎంత త్వ‌ర‌గా వ‌న్డే ఫార్మాట్‌కు త‌గ్గ‌ట్లు త‌మ బ్యాటింగ్ మార్చుకుంటే అంత మంచిది. శిఖ‌ర్, పాండ్య‌కు తోడుగా.. కెప్టెన్ కోహ్లీతో పాటు శ్రేయాస్‌, రాహుల్‌, మ‌యాంక్‌లు స‌త్తా చాటిటే.. బ్యాటింగ్ విభాగంలో భార‌త్‌కు తిరుగుండ‌దు.

భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ మిన‌హా.. మిగ‌తా అంద‌రూ దారాళంగా ప‌రుగులిచ్చారు. గాయంతో చాహ‌ల్ మైదానాన్ని వీడ‌గా.. సైనీ వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్నారు. దీంతో రెండో వ‌న్డేలో వీరు అందుబాటులో ఉండే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌. వీరి స్థానంలో కుల్దీప్‌, శార్దుల్‌లు జ‌ట్టులోకి రావ‌చ్చు. ఇక పేస్ గుర్రం బుమ్రా త్వ‌రగా ల‌య‌ను అందుకోవాల్సి ఉంది. ఫీల్డింగ్ కూడా చాలా మెరుగ‌వ్వాల్సి ఉంది. భార‌త బౌల‌ర్లు ఎలా రాణిస్తారు అనే దానిపైనే టీమ్ఇండియా విజ‌యావ‌శాకాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

ఆస్ట్రేలియా ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జ‌ట్టు ప‌టిష్టంగా ఉంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో పాటు స్టీవ్‌స్మిత్ శ‌త‌కాల‌తో స‌త్తాచాట‌గా.. ఆల్‌రౌండ‌ర్ మాక్స్‌వెల్ కూడా ఫామ్‌లోకి రావ‌డంతో బ్యాటింగ్ విభాగంలో ఆసీస్ దుర్భేద్యంగా క‌నిపిస్తోంది. ఇక హాజివుడ్‌, మిచెల్ స్టార్‌, ఆడ‌మ్ జంపా, స్టోయినిస్‌, ప్యాట్ కమిన్స్‌తో కూడిన బౌలింగ్ విభాగం నుంచి భార‌త బ్యాట్స్‌మెన్ల‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు.




Next Story