టీ20 సిరీస్‌ లక్ష్యంగా భారత్‌.. ఆసీస్‌తో నేడు తొలి మ్యాచ్‌

India vs Aus T20 Series. ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన టీమిండియా.. నేటి నుండి జ‌రుగ‌నున్న టీ20‌

By Medi Samrat  Published on  4 Dec 2020 10:35 AM IST
టీ20 సిరీస్‌ లక్ష్యంగా భారత్‌.. ఆసీస్‌తో నేడు తొలి మ్యాచ్‌

ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన టీమిండియా.. నేటి నుండి జ‌రుగ‌నున్న టీ20‌ పోరుపై దృష్టి పెట్టింది. చివరి వన్డేను గెలిచిన ఉత్సాహంతో భారత జట్టు బరిలోకి దిగబోతుండగా.. అటు ఆసీస్ జ‌ట్టు‌ మాత్రం ఈ సిరీస్‌ను కూడా వశం చేసుకోవాలన్న కసితో కనిపిస్తోంది. యువ ఆటగాళ్ల చేరికతో పాటు ఆల్‌రౌండర్ల అండతో కోహ్లీ సేన‌ తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చూపాలనుకుంటోంది.

మనూకా ఓవల్‌ మైదానం వేదికగా జ‌రుగ‌నున్న మొద‌టి టీ20లో టీమిండియాకు వాషింగ్టన్‌ సుందర్‌, జడేజా, పాండ్యా రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. పేసర్లు బుమ్రా, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌లతో బౌలింగ్ విభాగం సమతూకంగా కనిపిస్తోంది. ఇక లెగ్‌ స్పిన్నర్‌ చాహల్ గాడిన ప‌డాల్సివుంది.

బ్యాటింగ్‌లో ఐపీఎల్‌లో రాహుల్‌ తడాఖా చూపిస్తూ ఆరెంజ్‌ క్యాప్‌ సాధించిన విషయం తెలిసిందే. అలాగే మయాంక్‌, శాంసన్‌ కూడా ఈ స్థానం కోసం రిజర్వ్‌లో ఉంటారు. అయితే ఎవరు తుది జట్టులో ఉన్నా పవర్‌ప్లే ఓవర్లను సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోహ్లీ, అయ్యర్‌ మూడు, నాలుగు స్థానాల్లో రానున్నారు. అయితే స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ను కోరుకుంటే సుందర్‌ స్థానంలో మనీశ్‌ పాండేకు చాన్స్‌ దక్కినా ఆశ్చర్యం లేదు. హార్దిక్‌, జడేజా కూడా బ్యాట్లు ఝుళిపిస్తుండడంతో భారత్‌ భారీ స్కోరుపై ఆశలు పెట్టుకుంది.

ఇక ఆస్ట్రేలియా జ‌ట్టులో వార్నర్‌ గాయంతో.. పేసర్‌ కమిన్స్‌ విశ్రాంతి కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. ఇక ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌పై కూడా స్పష్టత లేదు. కెప్టెన్‌ ఫించ్‌కు జతగా మాథ్యూ వేడ్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో సరిగా రాణించలేకపోయిన స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉండడం ఆసీస్‌కు సానుకూలాంశం. బౌలింగ్‌లో స్పిన్నర్‌ జంపా, అగర్‌, హాజెల్‌వుడ్‌ ఇబ్బందిపెట్టనున్నారు.

ఇదిలావుంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరిగితే.. భారత్‌ 11-8తో ఆధిక్యంలో ఉంది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం తమ జట్ల బలాబలాలపై కూడా అంచనాకు రావచ్చనే ఆలోచనలో రెండు జట్లూ ఉన్నాయి.

జట్లు

భారత్ ‌: ధవన్‌, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయాస్‌, మనీష్‌/వాషింగ్టన్‌ సుందర్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, దీపక్‌ చాహర్‌, షమి/నటరాజన్‌, బుమ్రా, చాహల్‌/కుల్దీప్‌.

ఆసీస్‌: ఫించ్‌ (కెప్టెన్‌), వేడ్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, క్యారీ, అగర్‌, అబాట్‌, ఆండ్రూ టై/స్టార్క్‌, జంపా, హాజెల్‌వుడ్‌.


Next Story