రెచ్చిపోయిన ఆసీస్ బ్యాట్స్‌మెన్.. ముఖ్యంగా స్మిత్ అయితే..

India vs Aus 2nd One day. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోయారు.

By Medi Samrat  Published on  29 Nov 2020 7:56 AM GMT
రెచ్చిపోయిన ఆసీస్ బ్యాట్స్‌మెన్.. ముఖ్యంగా స్మిత్ అయితే..

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోయారు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచ‌రీ, ఓపెన‌ర్లు వార్న‌ర్‌, ఫించ్‌, లాబుషేన్‌, మ్యాక్స్‌వెల్ హాఫ్ సెంచరీలు సాధించ‌డంతో ఆసీస్ జ‌ట్టు నిర్ణీత‌ 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 ప‌రుగులు చేసింది. టాస్‌ గెలిచి ఆసీస్‌ మరోసారి బ్యాటింగ్‌ వైపే మొగ్గుచూపింది. మూడు వన్డేల‌ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆసీస్‌ భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. సిరీస్‌పై పట్టు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ తప్పనిసరిగా నెగ్గాలి. అయితే భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం వుంది.

ముఖ్యంగా స్మిత్‌, మ్యాక్స్‌వెల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. మెరుపు ఇన్నింగ్స్‌ల‌తో టీమిండియా బౌల‌ర్ల ప‌ని ప‌ట్టారు. రెండో వ‌న్డేలోనూ స్టీవ్ స్మిత్ సెంచ‌రీ బాదాడు. ఈసారి కూడా కేవ‌లం 62 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో స్మిత్ సెంచ‌రీ కొట్ట‌డం విశేషం. క్రీజులోకి వ‌చ్చీ రావ‌డంతోనే బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డిన‌ అత‌డు.. ఇండియ‌న్ టీమ్‌పై త‌న అద్భుత‌మైన ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. తొలి వ‌న్డేలోనూ స్మిత్ 62 బంతుల్లోనే సెంచ‌రీ కొట్ట‌డం ఇక్క‌డ మ‌రో విశేషం. ఇక చివ‌ర్లో మ్యాక్స్‌వెల్ మ‌రోసారి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 29 బంతుల్లోనే 4 సిక్స‌ర్లు, 4 ఫోర్ల‌తో 63 ప‌రుగులు చేశాడు.

అంత‌కుముందు వార్న‌ర్ 77 బంతుల్లో 83, ఫించ్ 69 బంతుల్లో 60, లాబుషేన్ 61 బంతుల్లో 70 ప‌రుగులు చేశారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి టీమిండియా బౌల‌ర్లు మ‌రోసారి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. బుమ్రా 79, ష‌మి 73, చాహ‌ల్ 71, సైనీ 70, జ‌డేజా 60 ప‌రుగులు ధార‌ళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు.


Next Story