వెస్టిండీస్‌తో స‌మ‌రానికి టీమ్ఇండియా సై.. తొలి వ‌న్డే నేడే

India Tour of West Indies 2022 Today 1st ODI.ప‌రిమిత ఓవ‌ర్ల సిరీసుల్లో ఇంగ్లాండ్‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఓడించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 July 2022 6:34 AM GMT
వెస్టిండీస్‌తో స‌మ‌రానికి టీమ్ఇండియా సై.. తొలి వ‌న్డే నేడే

ప‌రిమిత ఓవ‌ర్ల సిరీసుల్లో ఇంగ్లాండ్‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఓడించిన ఉత్సాహంలో ఉన్న టీమ్ఇండియా మ‌రో స‌మ‌రానికి సిద్ద‌మైంది. క‌రేబీయ‌న్ గ‌డ్డ‌పై స‌వాలుకు సై అంటోంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక‌గా నేడు తొలి వ‌న్డేలో విండీస్‌ను ఢీ కొట్ట‌నుంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, పంత్, హార్థిక్, బుమ్రాల‌కు విశ్రాంతినిచ్చిన నేప‌థ్యంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని స‌త్తాచాటాల‌ని కుర్రాళ్లు బావిస్తున్నారు.

రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శర్మ‌కు విశ్రాంతి ఇవ్వ‌డంతో సీనియర్ ఆట‌గాడు శిఖర్ ధావన్‌ సారథ్యంలో యంగ్ ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. అయితే తుది కూర్పుపై ఆస‌క్తి నెల‌కొంది. శిఖ‌ర్ ధావ‌న్‌తో ఓపెనింగ్ చేసేందుకు ముగ్గురు ఆట‌గాళ్లు పోటీ ప‌డుతున్నారు. ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్ ల‌లో ఎవ‌రు ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగుతారో చూడాలి. ఇక షార్ట్‌పిచ్ బంతుల‌కు వికెట్ పారేసుకుంటున్న శ్రేయస్‌ అయ్య‌ర్‌పై ఒత్తిడి నెల‌కొంది. సంజు శాంస‌న్‌, దీప‌క్ హుడా, సూర్య కుమార్ యాద‌వ్ లు తుది జ‌ట్టులో ఉండ‌డం ఖాయం. రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌ బౌలింగ్‌ భారం మోయ‌నున్నారు.

ఇక బంగ్లాదేశ్‌తో వ‌న్డే సిరీస్‌ను 0-3తో కోల్పోయిన విండీస్ ఆ ప‌రాభ‌వం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని భావిస్తోంది. ఆల్‌రౌండ‌ర్ హోల్ట‌ర్ అందుబాటులోకి రావ‌డంతో విండీస్ జ‌ట్టుకు స‌మ‌తూకం ల‌భించ‌నుంది. సీనియ‌ర్లు లేక‌పోయినా భార‌త్ ఫేవ‌రేట్‌గానే బ‌రిలోకి దిగుతోంది. భార‌త్‌ను ఓడించాలంటే నికోల‌స్ పూర‌న్ సార‌థ్యంలో విండీస్ శ‌క్తికి మించిన ప్ర‌ద‌ర్శ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇక పిచ్ బ్యాటింగ్‌, బౌలింగ్‌కు స‌మానంగా స‌హ‌క‌రించే అవ‌కాశం ఉంది. సిన్న‌ర్లు ఆధిప‌త్యం చెలాయించవ‌చ్చు. మేఘాలు క‌మ్ముకుని ఉంటాయ‌ని, చిరు జ‌ల్లులు కురిసే అవ‌కాశంఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది. అయితే.. మ్యాచ్ ఆగిపోయే అవ‌కాశాలు చాలా త‌క్కువేన‌ని తెలిపింది.

Next Story