కరేబియన్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా
India thrash Windies by 119 runs to complete clean sweep.కరేబియన్ గడ్డపై టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. తొలిసారి
By తోట వంశీ కుమార్ Published on 28 July 2022 8:14 AM ISTకరేబియన్ గడ్డపై టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. తొలిసారి విండీస్‌ను వారి సొంత గడ్డపై వైట్‌వాష్ చేయడంతో పాటు ఆ జట్టుపై వరుసగా 12 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచి ఈ రికార్డు సాధించిన తొలి జట్టుగా టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన మూడో వన్డేల్లో పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినప్పటికి శిఖర్ నేతృత్వంలోని భారత్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్(58), శుభ్‌మన్ గిల్(98 నాటౌట్) లు తొలి వికెట్‌కు 113 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అనంతరం ధావన్ ఔటైనా గిల్‌కు శ్రేయస్ అయ్యర్(44) జతకలిశాడు. శ్రేయస్ క్రీజులోకి వచ్చిన తరువాతి ఓవర్‌లోనే వర్షం కురవడంతో రెండు గంటలకు పైగా ఆటను నిలిపివేశారు. అప్పటికే గిల్ అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆట తిరిగి ప్రారంభమైన తరువాత మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు.
తిరిగి ఆట ఆరంభమైన తరువాత గిల్, శ్రేయస్ పోటాపోటిగా బౌండరీలు బాది 8 ఓవర్లల్లో 86 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతూ అర్థశతకానికి చేరువైన శ్రేయస్‌ను హోసిన్ ఔట్ చేశాడు. కాసేపటికి సూర్యకుమార్ యాదవ్(8) సైతం పెవిలియన్ చేరాడు. సంజూ శాంసన్(6 నాటౌట్) సహకారంతో గిల్ మరింత ధాటిగా బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా 36 ఓవర్లో 225/3తో నిలిచింది. గిల్ 98 పరుగులతో క్రీజులో ఉండగా ఈ దశలో మరోసారి వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. వర్షం నిలిచిపోయాక అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 నిర్దారించారు. దీంతో గిల్ వన్డేల్లో తొలి శతకాన్నిచేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.
అనంతరం భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ నికోలస్ పూరన్ ( 42 ), బ్రెండన్ కింగ్ (42) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టగా శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.ప్లేయర్ ఆఫ్ సిరీస్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు శుభ్‌మన్ గిల్‌కు దక్కాయి.