బంగ్లాదేశ్ ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో శనివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. కానీ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-2తో చేజార్చుకుంది. 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. భారత్ తరఫున శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ బౌలింగ్ లైనప్‌ను చీల్చి చెండాటంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 290 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.