కొత్త బాధ్యతల్లో ధోని.. అశ్విన్‌కు అనూహ్య పిలుపు
India T20 World Cup Squad Announced.క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 9 Sept 2021 8:47 AM ISTక్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. టీ20 ప్రపంచకప్ సమరానికి జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అన్న ఉత్కంఠకు తెరపడింది. టీ 20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన జట్టును చేతన్‌శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రదర్శనతో పాటు మెగాటోర్నికి వేదికైన యూఏఈ, ఒమన్ పరిస్థితులకు అనుగుణంగా జట్టును ఎంపిక చేశారు. సీనియర్ సిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అనూహ్యంగా పిలుపు వచ్చింది. నాలుగేళ్ల తరువాత టీ20 జట్టులో చోటు దక్కింది. ఇక క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భారత జట్టుకు మెంటార్‌గా నియమితుడయ్యాడు.
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేయగా.. వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు. ఐపీఎల్ అనంతరం మెగా టోర్నీ కూడా యూఏఈలోనే జరగనుంది. దీంతో టోర్నీలో పిచ్‌లు బాగా నెమ్మదించి స్పిన్‌కు అనుకూలిస్తాయని అంచనా బావించడమే అందుకు కారణం. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, అశ్విన్ లు. సంజు శాంసన్‌ను కాదని ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. అయితే.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, లెగ్‌స్పిన్నర్ చహల్‌కు మాత్రం నిరాశ తప్పలేదు. కేఎల్ రాహుల్, రోహిత్, కిషన్‌ల రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉండడంతో ధావన్‌ను సెలక్షన్ కమిటీ విస్మరించింది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న మహేంద్రుడు.. బోర్డు కార్యదర్శి జై షా విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీ కోసం 'మెంటార్'గా ఉండేందుకు అంగీకరించాడు. కెప్టెన్ విరాట్‌కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అందరూ ధోని జట్టుతో ఉండేందుకు అంగీకరించారని ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా వెల్లడించారు. కాగా.. కోచ్ రవిశాస్త్రి, అత్యుత్తమ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉండగా అదనంగా మహీ మార్గనిర్దేశనం అవసరమా అన్నది ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు..
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ
స్టాండ్ బై ప్లేయర్స్.. శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్
భారత్ టీ20 షెడ్యూల్..
అక్టోబర్ 24: భారత్ X పాకిస్థాన్
అక్టోబర్ 31: భారత్ X న్యూజిలాండ్
నవంబర్ 3: భారత్ X అఫ్గానిస్థాన్
నవంబర్ 5: భారత్ X బీ1
నవంబర్ 8: భారత్ X ఏ2