ద్యుతీ చంద్‌పై నాలుగేళ్ల నిషేధం

భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌పై యాంటీ డోపింగ్‌ ప్యానెల్‌ నాలుగేళ్ల నిషేధం విధించింది.

By Medi Samrat  Published on  18 Aug 2023 7:24 PM IST
ద్యుతీ చంద్‌పై నాలుగేళ్ల నిషేధం

భారత ఫాస్టెస్ట్ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌పై యాంటీ డోపింగ్‌ ప్యానెల్‌ నాలుగేళ్ల నిషేధం విధించింది. డోప్‌ టెస్టులో విఫలమైనందుకు ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు ప్యానెల్‌ స్పష్టం చేసింది. నిషేధిత ‘సెలక్టివ్‌ ఆండ్రోజన్‌ రిసెప్టార్‌ మాడ్యులేటర్స్‌’ ను ద్యుతి తీసుకున్నట్లు గత ఏడాది డిసెంబర్‌లో నాడా నిర్వహించిన డోప్‌ పరీక్షల్లో తేలింది. ఈ కారణాలతో యాంటీ డోపింగ్‌ ప్యానెల్‌ ద్యుతిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం 2023 జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. నిషేధానికి సంబంధించిన లెటర్‌ అందుకున్నప్పటి నుంచి 21 రోజులలోపు తనపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ద్యుతీచంద్‌ రివ్యూ పిటిషన్‌ వేసుకోవచ్చని తెలిపింది.

ద్యుతీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా ద్యుతీ చంద్‌ ఈ మందులు వాడలేదని తెలిపారు. ఆమె తీసుకున్న ఏజెంట్లు స్పోర్టింగ్‌ అడ్వాంటేజ్‌ ఇవ్వవని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల నిషేధంపై తాము అప్పీలుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని క్లీన్‌చిట్‌ లభిస్తుందని అన్నారు. ద్యుతీ చంద్ ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వందలసార్లు డోపింగ్‌ టెస్టులు ఎదుర్కొని క్లీన్ చిట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 27 ఏళ్ల ద్యుతీ చంద్‌ ఆసియా క్రీడల్లో రెండుసార్లు రజతాలు గెలిచింది. 2011లో ఇండియన్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌లో 11.17 సెకన్లలో పరుగు పూర్తి చేసింది ద్యుతీ. 100 మీటర్ల పరుగు పందెంలో ఇప్పటికీ నేషనల్‌ రికార్డు ఆమె పేరిటే ఉంది.

Next Story