సౌతాఫ్రికా-భారత్‌ రెండో టీ20 మ్యాచ్‌కూ వర్షం ముప్పు!

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఒక మ్యాచ్‌ వర్షార్పణం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  12 Dec 2023 5:35 AM GMT
india, south africa, t20 series, cricket ,

 సౌతాఫ్రికా-భారత్‌ రెండో టీ20 మ్యాచ్‌కూ వర్షం ముప్పు!

టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్‌లో ఉంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఒక మ్యాచ్‌ వర్షార్పణం అయ్యింది. తొలి టీ20 మ్యాచ్‌ సందర్భంగా టాస్‌ పడకముందు నుంచే వర్షం పడటంతో ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే.. ఇప్పుడు రెండో టీ20కి ఇరుజట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ క్రికెట్ అభిమానులకు చేదువార్తను చెప్పింది. రెండో టీ20 మ్యాచ్‌కు వేదికవుతోన్న ఎలిజబెత్‌ నగరంలో కూడా మంగళవారం వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

మంగళవారం సెయింట్‌ జార్జ్‌ పార్క్‌లో దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా డర్బన్‌లో జరగాల్సిన మ్యాచ్‌ రద్దైనట్లుగానే వర్షం ముప్పు ఉందని చెబుతున్నారు. ఎలిజబెత్‌ పట్టణంలో భారీ వర్షాలుకురిసే చాన్స్ ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. సిటీ మొత్తం మేఘావృతమై ఉంటుందని.. ఒక్కసారి వాన మొదలైతే బ్రేక్‌ ఇచ్చే అవకాశాలు కూడా ఉండవని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఎలిజబెత్‌ నగరంలో 17 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.

ఇదిలా ఉండగా టీమిండియాలో స్వల్పమార్పులు జరిగాయి. వన్డే వరల్డ్‌ కప్‌-2023 తర్వాత విశ్రాంతి తీసుకున్న స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌లు దక్షిణాప్రికాతో టీ20 సిరీస్‌కు జట్టులో జాయిన్‌ అయ్యారు. వీరి రాకతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆడిన పలువురికి జట్టులో అవకాశం దొరక్కపోవచ్చు. ఆ సిరీస్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్‌ గైక్వాడ్‌ గిల్‌ వచ్చిన సందర్భంగా తుదిజట్టులో అతనికి స్థానం దక్కకపోవచ్చు. ఇక టీ20 ఫార్మట్లలో సఫారీలపై టీమిండియాకు మంచి రికార్డులే ఉన్నాయి. టీ20ల్లో భారత్‌, సౌతాఫ్రికా జట్లు 25 సార్లు తలపడగా.. అందులో 13 సార్లు ఇండియా గెలిచింది. సౌతాఫ్రికా 10 సార్లు గెలిచింది. రెండు మ్యాచుల్లో మాత్రం ఫలితాలు రాలేదు. ఇక ఎలిజబెత్‌లో మంగళవారం రాత్రి 8.30 గంటలకు ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరగాల్సి ఉంది.


Next Story