IND Vs SA: నేడే చివరి టీ20, టీమిండియాలో మార్పులకు చాన్స్!
టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 14 Dec 2023 7:29 AM ISTIND Vs SA: నేడే చివరి టీ20, టీమిండియాలో మార్పులకు చాన్స్!
టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా సఫారీలతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్ట్ సిరీస్‍లు ఆడనుంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్‌లు ముగిశాయి. ఇందులో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. రెండో టీ20లో సౌతాఫ్రికా విజయాన్ని అందుకుంది. ఇప్పుడు నిర్ణయాత్మక మ్యాచ్ మూడో టీ20కి రంగం సిద్ధం అయ్యింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ భావిస్తోంటే.. ఎలాగైనా మళ్లీ గెలిచి సొంత గడ్డపై జరుగుతోన్న సిరీస్‌ను కైవలం చేసుకోవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 మ్యాచ్ రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది. సౌతాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ న్యూ వాండెరర్స్ స్టేడియంలో జరగనుంది. అయితే.. మొదటి టీ20కి వరుణుడు అడ్డుపడటంతో కనీసం ఆడకుండానే మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఇక రెండో టీ20కి కూడా వర్షం పడింది. అయితే.. డీఎల్‌ఎస్ మెథడ్‌తో సౌతాఫ్రికా గెలిచినట్లు ప్రకటించారు. ఈ మూడో టీ20కి కూడా వర్షం ముప్పు ఉందా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. జొహన్నెస్‌బర్గ్‌లో వాన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. కానీ.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు చెప్పారు.
జొహన్నెస్‌బర్గ్ పిచ్ బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. మంచి పేస్.. ఇంకా బౌన్స్ ఉంటాయి. ఔట్ ఫీల్డ్ కూడా వేగంగా ఉంటుంది. దాంతో.. భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అనారోగ్యం నుంచి కోలుకుంటే.. శుభ్‌మన్ గిల్ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. ఇక స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ స్థానంలో యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
టీ20లకు భారత్‍కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తుండగా.. వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. టెస్టు సిరీస్‍కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడు. టెస్టు జట్టులోకి రోహిత్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్, పేసర్ బుమ్రా వస్తారు.