లంచ్ విరామానికి టీమ్ఇండియా 109/2.. విరాట్‌కి ద్రావిడ్ స్పెష‌ల్ క్యాప్‌

India scored 109 runs at lunch Day1 against Sri Lanka in Mohali Test.మొహాలీ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2022 12:37 PM IST
లంచ్ విరామానికి టీమ్ఇండియా 109/2.. విరాట్‌కి ద్రావిడ్ స్పెష‌ల్ క్యాప్‌

మొహాలీ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి రోజు లంచ్ విరామానికి టీమ్ఇండియా రెండు వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(15), హ‌నుమ విహారి(30) క్రీజులో ఉన్నారు. లంక బౌల‌ర్ల‌లో లాహిరు కుమార, ల‌సిత్ ఎంబుల్దెనియా చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు టాస్ గెలిచిన భార‌త్‌ బ్యాటింగ్ చేప‌ట్టింది. భార‌త ఇన్నింగ్స్‌ను రోహిత్ శ‌ర్మ‌(29), మ‌యాంక్ అగ‌ర్వాల్‌(33)లు ఆరంభించారు. తొలి మూడు ఓవ‌ర్ల‌ను ఆచితూచి ఆడిన ఈ జంట నాలుగో ఓవ‌ర్ నుంచి వేగం పెంచింది. ఇద్ద‌రూ తొలి వికెట్‌కు అర్థ‌శ‌త‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పి భార‌త్‌కు శుభారంభం అందించారు. లాహిరు కుమార వేసిన 10 ఓవ‌ర్‌లో రెండు పోర్లు బాది ఊపు మీదున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌రువాతి బంతిని భారీ షాక్‌కు య‌త్నించి ఔటైయ్యాడు. వ‌న్‌డౌన్‌లో హ‌నుమ విహారి వ‌చ్చాడు. అర్థ‌శ‌త‌కం వైపు ప‌య‌నిస్తున్న మ‌యాంక్‌ను ఎంబుల్దెనియా పెవిలియ‌న్ చేర్చాడు. దీంతో భార‌త్ 80 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. అనంత‌రం విహారికి జ‌తక‌లిసిన కోహ్లీ మ‌రో వికెట్ ప‌డ‌కుండా తొలి సెష‌న్‌ను ముగించారు.

రాహుల్ ద్రావిడ్ నుంచి స్పెష‌ల్ క్యాప్‌..

మొహాలీ టెస్టు విరాట్ కోహ్లీ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌. ఈ సంద‌ర్భంగా భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అత‌డికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప్ర‌త్యేక‌మైన జ్ఞాపిక‌తో పాటు వందో టెస్టు క్యాప్‌ను అంద‌జేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో విరాట్ భార్య అనుష్క శ‌ర్మ కూడా పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా ద్రావిడ్ మాట్లాడుతూ.. ఈ ఘ‌న‌త సాధించ‌డానికి విరాట్ నిజ‌మైన అర్హుడ‌న్నారు. దీని కోసం విరాట్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌ని మెచ్చుకున్నాడు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని శిఖ‌రాలు అధిరోహించేందుకు ఈ వందో టెస్టు కోహ్లీకి కొత్త ఆరంభ‌మ‌ని ద్రావిడ్ చెప్పాడు. కోహ్లీ మాట్లాడుతూ బావోద్వేగం చెందాడు. త‌న చిన్న‌నాటి హీరోల్లో ఒక‌రైన ద్రావిడ్ నుంచి వందో టెస్టు క్యాప్ అందుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పాడు. టీమ్ఇండియా త‌రుపున ఆడేందుకు త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి ధ‌న్య వాదాలు తెలిపాడు.

Next Story