ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మూడో, చివరి T20 ఇంటర్నేషనల్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఆస్ట్రేలియాపై సిరీస్‌ను కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన స్ట్రోక్‌ప్లే, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ టెక్నిక్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. కోహ్లి (48 బంతుల్లో 63), సూర్యకుమార్ (36 బంతుల్లో 69) 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయానికి పెద్దపీట వేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.
అంతకుముందు కామెరాన్ గ్రీన్ (52), టిమ్ డేవిడ్ (54) రాణించడంతో ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (3/33) మూడు వికెట్లు తీశాడు. ఓ సంచలనాత్మక రనౌట్ కూడా చేశాడు. యుజ్వేంద్ర చాహల్ (1/22) కూడా పొదుపుగా బౌలింగ్ చేశాడు.
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. తొలి నాలుగు ఓవర్లలోనే ఓపెనర్లు కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (17)లు ఔటవడంతో కష్టాల్లో పడింది. కానీ కోహ్లీ, సూర్యకుమార్ లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియన్ బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.