పారాలింపిక్స్ : భారత్ సరికొత్త రికార్డులు..!

India Records In Paralympics. టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడకారులు అద్భుత ప్రదర్శనతో

By అంజి  Published on  31 Aug 2021 3:19 AM GMT
పారాలింపిక్స్ : భారత్ సరికొత్త రికార్డులు..!

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తమ ఆటతో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇందుకు నిదర్శనం భారత్‌ ఖాతాలో వచ్చి చేరుతున్న పతకాలే సాక్ష్యం. భారత్‌ ఖాతాలో ఇప్పటికే 7 పతకాలు వచ్చి చేరాయి. రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్యంతో పారాలింపిక్స్‌ పట్టికలో భారత్‌ 26 స్థానంలో నిలిచింది. భారత్‌కు తొలి పతకాన్ని టేబుల్‌ టెన్నిస్‌లో భవీనా బెన్ పటేల్ అందించింది. టేబుల్‌ టెన్నిస్‌లో ఆమె రజత పతకం సాధించింది. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు మొదటి సారి టేబుల్‌ టెన్నిస్‌లో రజత పతకం సాధించి రికార్డు సృష్టించింది. ఫైన‌ల్లో కాంస్యం చేసిన పోరులో చైనా ప్లేయర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ సీడ్‌ యింగ్‌ జావో చేతిలో 0-3 తేడాతో భవీనా బెన్ ఓడిపోయి రజత పతకం సాధించింది. మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్-56 పోటీలో యోగేశ్ కథునియా రజత పతకం సాధించాడు. 44.38 మీటర్ల దూరం విసిరి డిస్కస్ త్రోలో యోగేశ్ రజతం నెగ్గాడు.

ఇటు పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో దేవంద్ర ఝంఝరియా రజత పతకం సాధించగా.. సుందర్ సింగ్ కాంస్యం సాధించాడు. దేవంద్ర జావెలిన్‌ను 64.35 మీటర్ల దూరం విసరగా.. సుందర్‌సింగ్ 64.01 మీటర్ల దూరం విసిరాడు. ఇక మరో అథ్లెట్ నిషాద్ కుమార్‌ పురుషుల హైజంప్ టీ47 విభాగంలో పోటీ పడి 2.06 మీటర్ల ఎత్తు దూకి రజత పతకం సాధించాడు. ఈ ఏడాది ఆసియాలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన చేసినా పారా అథ్లెట్‌గా నిషాద్‌ కుమార్ నిలిచాడు. అలాగే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో అవని లేఖారాకు బంగారు పతకాన్ని సాధించారు. దీంతో పారాలింపిక్స్‌ చరిత్రలో మొదటిసారిగా స్వర్ణ పతాకాన్ని సాధించిన మహిళగా అవని లేఖారాకు చరిత్ర సృష్టించారు. మరో ఆటగాడు సైతం భారత్‌కు స్వర్ణపతకం సాధించిపెట్టాడు. జావెలిన్ త్రో ఎఫ్ 64 విభాగంలో సుమిత్ అంతిల్‌ బంగారు పతకాన్ని సాధించాడు. చివరి ఫైనల్‌ త్రోలో 68.08 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి సుమిత్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

డిస్కస్ త్రో ఎఫ్-56 విభాగంలో భారత అథ్లెట్ వినోద్ కుమార్‌ డిస్క్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచినా.. అతడికి పతకం దక్కలేదు. పారాలింపిక్స్‌ పోటీలకు వినోద్‌ కుమార్‌ అర్హుడుకాదని ఇతర అథ్లెట్లు ఫిర్యాదు చేయడంతో... నిర్వాహకులు వినోద్‌ వర్గీకరణ ప్రక్రియను సమీక్షించారు. సమీక్ష అనంతరం వినోద్‌ కుమార్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ పారాలింపిక్స్‌ నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్‌కు కాంస్య పతకం చేజారింది. పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన విజేతలకు హర్యానా ప్రభుత్వం ప్రోత్సహకాలు ప్రకటించింది. స్వర్ణ పతక విజేత సమిత్ అంతిల్‌కు రూ.6 కోట్ల బహుమతిని ప్రకటించింది. అలాగే రతజ పతక విజేత యోగేశ్‌కు రూ.4 కోట్ల బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు సుమిత్, యోగేశ్‌లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హర్యానా ప్రభుత్వం తెలిపింది.


Next Story