ఒలింపిక్స్ లో క్రికెట్.. జట్లను సిద్ధం చేయడానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

India ready to participate in Olympics 2028. ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలని ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూ ఉంది.

By Medi Samrat  Published on  17 April 2021 10:30 AM GMT
ఒలింపిక్స్ లో క్రికెట్.. జట్లను సిద్ధం చేయడానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలని ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో మాత్రమే ఫేమస్ అయిన క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేరిస్తే మరింత ఆదరణ దక్కే అవకాశం కూడా ఉందని భావిస్తూ ఉన్నారు. తాజాగా ఒలింపిక్స్ విషయంలో బీసీసీఐ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేరిస్తే పురుషులు, మహిళల టీంలను అందులో ఆడించేందుకు బీసీసీఐ కూడా సమ్మతమనే సిగ్నల్స్ వచ్చాయి. బోర్డు అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2028లో జరిగే లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ రోస్టర్ లో క్రికెట్ ను చేరిస్తే భారత పురుషులు, మహిళల జట్లను పంపాలని భావిస్తోంది. వచ్చే ఏడాది బ్రిటన్ లోని బర్మింగ్ హాంలో జరగబోయే కామన్ వెల్త్ గేమ్స్ కు మహిళల టీంను పంపించేందుకు అపెక్స్ కౌన్సిల్ అంగీకరించింది.

మహిళల టీంకు సంబంధించి షెడ్యూల్ నూ ఖరారు చేసింది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడేందుకు నిర్ణయించింది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ నకు సన్నాహకంగా న్యూజిల్యాండ్ తో మరో సిరీస్ ను ఆడేందుకు అంగీకరించింది. గత ఏడాది జరిగినట్టే మూడు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. మహిళల ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ లో సిరీస్ ఆడనుంది. తిరిగొచ్చాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ పూర్తవ్వగానే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో, ఆ తర్వాత న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక సిరీస్ ను మహిళల టీం ఆడనుందనే విషయాన్ని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. ఇక ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేరిస్తే భారత్ ఖాతాలో ఒకట్రెండు పతకాలు వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇక ఐసీసీ ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చేలా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి


Next Story
Share it