కొత్త సంవత్సరం వేళ సరికొత్త చరిత్ర సృష్టించిన బుమ్రా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2025 సంవత్సరం మొదటి రోజున భారీ రికార్డు సాధించాడు.
By Medi Samrat Published on 1 Jan 2025 4:27 PM ISTఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2025 సంవత్సరం మొదటి రోజున భారీ రికార్డు సాధించాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. బౌలర్లలో బుమ్రా అగ్రస్థానంలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో బుమ్రా 30 వికెట్లు పడగొట్టి ఈ సిరీస్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. బుమ్రాకు 907 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది భారత క్రికెట్ జట్టు చరిత్రలో ఓ బౌలర్ సాధించిన అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.
మెల్‌బోర్న్‌లో జరిగిన నాల్గవ టెస్ట్‌కు ముందు బుమ్రా రేటింగ్ పాయింట్లు 904 ఉన్నాయి. అతను అత్యధిక రేటింగ్ పరంగా మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను సమం చేశాడు. 2016లో అశ్విన్ అత్యధిక రేటింగ్ (904) సాధించాడు.. కానీ ఇప్పుడు బుమ్రా అతని రికార్డును బ్రేక్ చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో బుమ్రా తన 200 టెస్టు వికెట్లను పూర్తి చేశాడు. మ్యాచ్ ప్రకారం.. భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన ఆటగాళ్లలో బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. అయితే.. ఈ లిస్ట్‌లోని టాప్ ఫైవ్ బౌలర్లలో ఒక్క ఫాస్ట్ బౌలర్ మాత్రమే ఉన్నాడు. బుమ్రా 44 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. అదే సమయంలో అశ్విన్ 37 టెస్టు మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. బంతుల పరంగా టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పూర్తి చేసిన బౌలర్ల గురించి చెప్పాలంటే.. బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. 200 వికెట్లు తీయడానికి బుమ్రా 8484 బంతులు వేయాల్సి వచ్చింది. ఈ జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన వకార్ యూనిస్ అగ్రస్థానంలో ఉన్నాడు.
అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఉమ్మడి 17వ బౌలర్ బుమ్రా. ఈ విషయంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ డెరెక్ అండర్‌వుడ్‌ను సమం చేశాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సిడ్నీ బర్న్స్ (932) రేటింగ్ పాయింట్లతో ఆల్ టైమ్ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, జార్జ్ లోమాన్ (931), ఇమ్రాన్ ఖాన్ (922), ముత్తయ్య మురళీధరన్ (920) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.