భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 276 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 52 పరుగులు చేశాడు. జోస్ ఇంగ్లిస్ 45 పరుగులు, స్టీవ్ స్మిత్ 41 పరుగులతో రాణించారు. లాబుషాగ్నే కూడా 39 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీశాడు. బుమ్రా, అశ్విన్, జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది.
అనంతరం టీమిండియా 48వ ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత జట్టులో రుతురాజ్ గైక్వాడ్(71), గిల్(74), కేఎల్ రాహుల్(58), సూర్యకుమార్ యాదవ్(50) పరుగులతో రాణించారు. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇది మాత్రమే కాదు.. మూడు ఫార్మాట్లలో భారత జట్టు ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టుగా అవతరించింది.
ఇదిలావుంటే.. భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఇప్పటివరకు మొత్తం 146 ODI మ్యాచ్‌లు జరిగాయి. 82 మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. భారత జట్టు 54 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 10 మ్యాచ్‌లలో ఫలితం లేదు. ఇక మొహాలీలో ఇరు జట్ల మధ్య మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. కంగారూ జట్టు ఇక్కడ నాలుగు మ్యాచ్‌లు గెలుపొందగా.. భారత్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.