భార‌త్‌కు చావో రేవో.. శ్రీలంక‌తో పోరు నేడే

India Face SriLanka In Do or die Super Four Match.ఎన్నో అంచ‌నాల‌తో ఆసియా క‌ప్ 2022 టోర్నిలో బ‌రిలోకి దిగింది టీమ్ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2022 9:01 AM GMT
భార‌త్‌కు చావో రేవో.. శ్రీలంక‌తో పోరు నేడే

ఎన్నో అంచ‌నాల‌తో ఆసియా క‌ప్ -2022 టోర్నిలో బ‌రిలోకి దిగింది టీమ్ఇండియా. అందుకు త‌గ్గ‌ట్లే తొలి రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించి గ్రూప్‌లో అగ్ర‌స్థానంలో నిలిచి సూప‌ర్‌-4 ద‌శ‌కు చేరుకుంది. అయితే.. సూప‌ర్‌-4 తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓట‌మిపాలైంది. ఫైన‌ల్ రేసులో నిల‌వాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో త‌ప్ప‌క గెల‌వాల్సిన స్థితిని కొని తెచ్చుకుంది. ఈ క్ర‌మంలో నేడు శ్రీలంక జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది.

అనుభం, రికార్డు ప‌రంగా ప్ర‌త్య‌ర్థి క‌న్నా భార‌త్ పై చేయి స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికి లంక‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలులేదు. చివ‌రి రెండు మ్యాచుల్లో ఆ జ‌ట్టు స‌మిష్టి త‌త్వంతో విజ‌యాలు సాధించింది. ఏ ఒక్క‌రో కాకుండా 11 మంది ఆట‌గాళ్లు జట్టు విజ‌యంలో త‌మ వంతు పాత్ర పోషించారు. ఈ విజ‌యాలు వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. కెప్టెన్ శ‌న‌క‌, నిశాంక, కుశాల్ మెండిస్‌, గుణ‌తిల‌క‌, రాజ‌ప‌క్స ల‌తో పాటు కరుణరత్నే కూడా బ్యాటింగ్‌లో కీల‌కంగా మారాడు.

భారీ స్కోర్లు చేయ‌కున్నా స‌మ‌యోచితంగా ఆడుతున్నారు. క్రీజులో అడుగుపెట్టిందే మొద‌లు బాదుడు మొద‌లు పెడుతున్నారు. వీరిని భార‌త బౌల‌ర్లు ఎంత త్వ‌ర‌గా పెవిలియ‌న్‌కు చేరిస్తే అంత మంచిది. స్పిన్న‌ర్లు హ‌స‌రంగ‌, తీక్ష‌ణ‌ల‌పై భారత బ్యాట‌ర్లు ఓ క‌న్నేసి ఉంచాల్సిందే.

ఆసియా క‌ప్ ముగిసే స‌రికి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టు కూర్పుపై ఓ స్ప‌ష్ట‌త కావాల‌ని టీమ్‌మేనేజ్‌మెంట్ బావిస్తోంది. అందుక‌నే సాధ్య‌మైనంత ఎక్కువ మందికి అవ‌కాశం ఇస్తూ అన్నిర‌కాల ప్ర‌త్యామ్నాయాల‌ను ప‌రీక్షిస్తోంది. బ్యాటింగ్ లో రోహిత్‌, రాహుల్‌, కోహ్లీలు ఫామ్‌లోకి రావ‌డం క‌లిసి వ‌చ్చే అంశం. అయితే.. మిడిల్ ఆర్డ‌ర్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్, రిష‌బ్ పంత్‌, హార్థిక్ పాండ్య‌, దీప‌క్ హుడా లు రాణించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ మ్యాచ్‌లో తుది జ‌ట్టులోకి కార్తీక్ కు చోటిస్తారా..? ఇస్తే ఎవ‌రి ప్లేస్‌లో ఇస్తారు ..? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా ఉంది.

జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్ లు టోర్నికి ముందే దూరం కాగా.. మ‌ధ్య‌లో జ‌డేజా గాయంతో వెళ్లిపోయాడు. దీంతో బౌలింగ్‌లో తడబాటు కనిపిస్తోంది. ఎంతో నమ్ముకున్న భువనేశ్వర్‌ పాక్‌తో మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్‌లో భారీగా ప‌రుగులు ఇచ్చాడు. ఈ టోర్నీలో చహల్‌ రాణించడం లేదు కాబట్టి అత‌డి స్థానంలో సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ అశ్విన్‌కు ఓ అవ‌కాశం ఇచ్చొచ్చు. లేదంటే ప్రపంచకప్‌ ప్రణాళికల్లో అతను లేడ‌నే విష‌యం స్ప‌ష్టం చేసిన‌ట్లు అవుతోంది. ఏదీ ఏమైనా.. లంక‌పై గెల‌వాలంటే భార‌త బౌలింగ్ మెరుగు అవ్వాల్సిందే.

Next Story