క్లీన్‌స్వీప్‌పై టీమ్ఇండియా కన్ను

India eye clean sweep against New Zealand.వ‌రుస‌గా రెండు టీ20 మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Nov 2021 3:24 AM GMT
క్లీన్‌స్వీప్‌పై టీమ్ఇండియా కన్ను

వ‌రుస‌గా రెండు టీ20 మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై క‌న్నేసింది. కోల్‌క‌త్తాలోని ఈడెన్ గార్డెన్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో నేడు(ఆదివారం) జ‌రిగే మూడో టీ20లోనూ విజ‌యం సాధించాల‌ని రోహిత్ సేన బావిస్తోంది. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి డీలాప‌డిన కివీస్ క‌నీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ కూడా హోరా హోరీగా సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే సిరీస్ గెలిచిన నేప‌థ్యంలో భార‌త్ తుది జ‌ట్టులో మార్పులు చేయ‌వ‌చ్చు. కొత్త ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం క‌ల్పించవచ్చు. ఈ సిరీస్ ద్వారా వెంక‌టేశ్ అయ్య‌ర్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ అరంగ్రేటం చేయ‌గా.. ఈ మ్యాచ్ ద్వారా అవేశ్ ఖాన్‌, రుతురాజ్ గైక్వాడ్ లకు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు. సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, దీప‌క్ చాహ‌ర్‌ల‌లో ఒక‌రిని త‌ప్పించి అవేశ్ ఖాన్ ను ఆడించొచ్చు. మ‌రోవైపు సీనియ‌ర్ స్పిన్న‌ర్ అశ్విన్‌, అక్ష‌ర్ ప‌టేల్‌ల‌లో ఒక‌రిని త‌ప్పించి చాహ‌ర్‌ను ఆడించే అవ‌కాశం ఉంది. భార‌త్‌కు బౌలింగ్ విభాగంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేన‌ప్ప‌టికి బ్యాటింగ్ విభాగంలో మాత్రం మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్లు రాణించాల్సి ఉంది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది.

మ‌రోవైపు న్యూజిలాండ్ ప‌రిస్థితి ఏమంత గొప్ప‌గా లేదు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ఆరంభాలు ల‌భించినా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌డంలో ఆ జ‌ట్టు విఫ‌ల‌మైంది. ఓపెన‌ర్ల‌పైనే అతిగా ఆధార‌ప‌డుతోంది. బ్యాటింగ్ విభాగంలో రెగ్యుల‌ర్ కెప్టెన్ విలియ‌మ్ స‌న్ లేని లోటు స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇక బౌలింగ్ విభాగం కూడా ప్ర‌త్య‌ర్థిని క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతుంది. కెప్టెన్ సౌథీ త‌ప్ప మిగిలిన వారు నిల‌క‌డ‌గా రాణించ‌డం లేదు. ముఖ్యంగా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్ పేస‌ర్ బౌల్డ్ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోతున్నాడు. బౌల్డ్ ఫామ్‌లోకి వ‌చ్చి స్పిన్నర్లు సాన్‌ట్నర్, సోధి త‌మ స‌త్తామేర‌కు రాణిస్తే భార‌త్ కు క‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

Next Story