మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే.. సిరీస్ సొంతం

India Defeat West Indies By 59 Runs To Take 3-1 Lead.టీమ్ఇండియా అద‌ర‌గొట్టింది. వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌లో చిత్తు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2022 3:02 AM GMT
మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే.. సిరీస్ సొంతం

టీమ్ఇండియా అద‌ర‌గొట్టింది. వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌లో చిత్తు చేసిన భారత్‌ టీ20 సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. శ‌నివారం జ‌రిగిన నాలుగో టీ20లో 59 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి 3-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది.

టాస్ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది భార‌త్. రిషభ్‌ పంత్‌ (44; 31 బంతుల్లో 6 ఫోర్లు), రోహిత్‌ శర్మ ( 33; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు శాంస‌న్‌ ( 30 నాటౌట్‌; 23 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ ( 24; 14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగులు చేసింది.

గాయం నుంచి కోలుకున్న రోహిత్ మ‌రో ఓపెన‌ర్ సూర్యకుమార్‌ యాదవ్‌(24)తో కలిసి మెరుపు ఆరంభాన్ని అందించాడు. వీరిద్ద‌రూ పోటాపోటీగా బౌండ‌రీలు బాద‌డంతో స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టింది. అయిదో ఓవ‌ర్‌లో రోహిత్ పెవిలియ‌న్ చేర‌ట‌ప్ప‌టికి స్కోర్ 53. ఆ త‌రువాతి ఓవ‌ర్ల‌లోనే సూర్య ఔటైయ్యాడు. ఈ ద‌శ‌లో పంత్.. దీప‌క్ హుడా(21)తో మూడో వికెట్‌కు 47, సంజు శాంస‌న్‌తో నాలుగో వికెట్‌కు 38 ప‌రుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో ప‌డేశాడు. పంత్‌తో పాటు కార్తీక్‌(6) త్వ‌ర‌గానే ఔటైనా సంజుతో జ‌త క‌లిసిన అక్ష‌ర్ ప‌టేల్ ఆఖ‌ర్లో (20 నాటౌట్‌; 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడ‌డంతో భార‌త్ భారీ స్కోర్ సాధించింది. విండీస్ బౌల‌ర్ల‌లో మెక్‌కాయ్‌, జోసెఫ్‌ రెండేసి వికెట్లు తీశారు.

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని చేదించేందుకు బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 132ల‌కే కుప్ప‌కూలింది. విండీస్ బ్యాటర్ల‌లో కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌(24), రోవ్‌మన్‌ పావెల్‌(24) లు ఓ మోస్తారుగా రాణించ‌గా.. మిగిలిన వారు దారుణంగా విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్‌సింగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అవేశ్‌ఖాన్, అక్షర్‌పటేల్, రవి బిష్ణోయ్ త‌లా రెండు వికెట్లు తీశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖ‌రిదైన చివ‌రి టీ20 నేడు జ‌ర‌గ‌నుంది.

Next Story