శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 303/9 డిక్లేర్‌

India declare at 303/9 Sri Lanka need 447 to win.చిన్న‌స్వామి వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ముందు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2022 9:25 PM IST
శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 303/9 డిక్లేర్‌

చిన్న‌స్వామి వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ముందు టీమ్ఇండియా భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో 303/9 వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ల‌భించిన 143 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకుని లంక ముందు 447 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్య‌ర్‌(67; 87 బంతుల్లో 9 ఫోర్లు), రిష‌బ్‌పంత్‌(50; 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. మిగ‌తా బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 46, హ‌నుమ విహారి 35, మ‌యాంక్ అగ‌ర్వాల్ 22, కోహ్లీ 13, ర‌వీంద్ర జ‌డేజా 22, అశ్విన్ 13, అక్ష‌ర్ ప‌టేల్ 9, ష‌మి 16* ప‌రుగులు చేశారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో జ‌య‌విక్ర‌మ నాలుగు వికెట్లు తీయ‌గా.. ఎంబుల్దేనియా మూడు, ధ‌నుంజ‌య డిసిల్వా, విశ్వ ఫెర్నాండో చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క ముందు 86/6 ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో ఆదివారం రెండో రోజు ఆట ప్రారంభించిన లంక మ‌రో 23 ప‌రుగులు మాత్ర‌మే జోడించి మిగిలిన వికెట్ల‌ను కోల్పోయింది. లంక బ్యాట‌ర్ల‌లో సీనియ‌ర్ ఆట‌గాడు ఏంజిలో మాథ్యూస్‌(43) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. నిరోష‌న్ డిక్వెల్లా(21), ధ‌నుంజ‌య డిసిల్వా(10) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించ‌గా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా 5 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అశ్విన్‌, ష‌మి చెరో రెండు వికెట్లు అక్ష‌ర్ ఒక వికెట్ తీశారు. భార‌త్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 252 ప‌రుగుల‌కే ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

Next Story