దెబ్బతిన్న సింహంలా కోహ్లీసేన.. స్వల్ప లక్ష్యాన్ని ఉప్‌మని ఊదేశారు
India crush Scotland by 8 wickets.పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఎదురైన పరాభవాల తరువాత దెబ్బతిన్న సింహంలా
By తోట వంశీ కుమార్ Published on 6 Nov 2021 8:33 AM ISTపాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఎదురైన పరాభవాల తరువాత దెబ్బతిన్న సింహంలా కోహ్లీసేన విజృంభిస్తోంది. సెమీస్ చేరాలంటే విజయంతో పాటు నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు పసికూన స్కాట్లాండ్ పై పంజా విసిరింది. స్కాట్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమ్ఇండియా అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఉప్‌మని ఉదేసింది. ఏ మూలనో మినుకుమినుకుమంటున్న ఆశలకు జీవం పోసింది. ఇక భారత ఆశలన్ని అఫ్గానిస్థాన్‌పైనే. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అఫ్గాన్ విజయం సాధిస్తే.. భారత్ సెమీస్ చేరే అవకాశం ఉంది. కివీస్ విజయం సాధిస్తే మాత్రం అఫ్గాన్‌తో పాటు మనమూ ఇంటికి రావాల్సిందే.
దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీసేన 8 వికెట్ల ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో తొలిసారి టాస్ గెలిచిన కోహ్లీ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు పసికూన స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో జడేజా(3/15), షమి(3/15) బుమ్రా(2/10), అశ్విన్ (1/29) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 6.3 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(50; 19 బంతుల్లో 6పోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ(30; 16 బంతుల్లో 5 పోర్లు, 1 సిక్స్) విధ్వంసం సృష్టించారు. విజయానికి చేరువైన క్రమంలో ఇద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరినా.. కెప్టెన్ కోహ్లీ (2 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (6 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. ఇక భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను సోమవారం నమీబియాతో తలపడుతుంది.
ఆదివారం మ్యాచ్‌పైనే ఆశలు..
గ్రూప్‌లో-2 లో ఉన్న జట్లలో పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌లు ఆడి అన్నింట్లో విజయం సాధించి 8 పాయింట్లతో ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసింది. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం అప్గానిస్థాన్, న్యూజిలాండ్, భారత జట్లు పోటిపడుతున్నాయి. ఇప్పటి వరకు కివీస్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. మూడింటిలో విజయం సాధించి 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. భారత్ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడవ స్థానంలో, అప్గాన్ కూడా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆదివారం అప్గాన్, కివీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధిస్తే.. ఎలాంటి సమీకరణాలు లేకుండానే నేరుగా సెమీస్‌కు వెలుతుంది. ఒక వేళ అప్గాన్ గెలిస్తే మాత్రం అప్పుడు భారత్, అఫ్గాన్‌కు కూడా అవకాశాలు ఉంటాయి. మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్ వెలుతుంది. ప్రస్తుతం భారత జట్టు నెట్‌రన్ మెరుగ్గానే ఉంది. ఆదివారం మ్యాచ్‌లో అప్గాన్ విజయం సాధించాలని 130 కోట్ల మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు.