టీమ్ఇండియాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు.. ఉత్కంఠ‌పోరులో పాక్‌పై విజ‌యం

India Beat Pakistan In Women's T20 World Cup.ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2023లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2023 10:54 AM IST
టీమ్ఇండియాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు.. ఉత్కంఠ‌పోరులో పాక్‌పై విజ‌యం

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భార‌త్ శుభారంభం చేసింది. దాయాది పాకిస్తాన్‌తో జ‌రిగిన తొలి పోరులో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త విజ‌యానికి 4 ఓవ‌ర్ల‌లో 41 ప‌రుగులు అవ‌స‌రం కావ‌డంతో మ్యాచ్ ఉత్కంఠ‌కు దారి తీసింది. అయితే జెమీమా, రిచా మెరుపులు మెరిపించ‌డంతో మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే భార‌త్ విజ‌యాన్ని అందుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్‌ బిస్మా మారూఫ్‌ ( 68 నాటౌట్‌; 55 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ‌శ‌త‌కంతో రాణించ‌గా అయేషా నసీమ్‌ (43 నాటౌట్‌; 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో దంచికొట్ట‌డంతో పాక్ మంచి స్కోర్‌నే సాధించింది. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో రాధా యాదవ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టగా, దీప్తి శర్మ, పూజ చెరో వికెట్ తీశారు.

అనంతరం ల‌క్ష్యాన్ని భార‌త్ 19 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. జెమీమా రోడ్రిగ్స్‌ ( 53 నాటౌట్‌; 38 బంతుల్లో 8 ఫోర్లు) స‌త్తా చాట‌గా, షఫాలీ వర్మ (33;25 బంతుల్లో 4 ఫోర్లు), రిచా ఘోష్‌ (31 నాటౌట్‌; 20 బంతుల్లో 5 ఫోర్లు) రాణించారు. పాక్ బౌల‌ర్లో నశ్ర రెండు వికెట్లు తీసింది. అజేయ అర్ధశతకంతో రాణించిన జెమీమాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. భార‌త్ త‌న రెండో మ్యాచ్‌ను బుధ‌వారం వెస్టిండీస్‌తో ఆడ‌నుంది.

ప్ర‌శంస‌ల జ‌ల్లు..

ఉత్కంఠ పోరులో విజ‌యం సాధించిన హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌పై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. అద్భుత ఆట తీరుతో ఇదే రీతిలో ముందుకు సాగుతూ మ‌రిన్ని విజ‌యాల‌ను అందుకోవాల‌ని ఆకాంక్షించారు.


Next Story