అండర్ 19 విమెన్స్ టీ20 ప్రపంచకప్ లో భాగంగా సెన్వెస్ పార్క్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయాన్ని అందుకుని ఫైనల్ కు చేరింది. న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. పార్షవి చోప్రా 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి కివీస్ జట్టును దెబ్బతీసింది. కివీస్ ఓపెనర్లు అన్నా బ్రౌనింగ్ (1), ఎమ్మా మెక్లియోడ్ (2) అరంభంలోనే చేతులెత్తేశారు. జార్జియా ప్లిమ్మర్ (35), ఇసాబెల్లా గాజ్ (26) జట్టును ఆదుకోవడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. భారత్ బౌలర్లలో టిటాస్ సాధు, మన్నత్ కశ్యప్, అర్చన దేవి చెరో వికెట్ తీశారు.
ఇక ఛేజింగ్ లో భారత్ ఏ మాత్రం తడబడలేదు. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 14.2 ఓవర్లలోనే మ్యాచ్ ని ముగించేయడం విశేషం. ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ (61) సూపర్ ఇన్నింగ్స్ ఆడగా.. సౌమ్య తివారి (22) విజయంలో కీలక పాత్ర పోషించింది. రెండో సెమీ ఫైనల్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు భారత్ తో ఫైనల్ లో తలపడనుంది. ఈ ఆదివారం ఫైనల్ జరగనుంది.