హాకీలో భారత్ మరో విజయాన్ని అందుకుంది. జపాన్‌లోని కకమీగహరా ఏరియాలో ఉన్న కవాసాకీ హెవీ ఇండస్ట్రీస్ హాకీ స్టేడియంలో జరిగిన ఉమెన్స్ జూనియర్ ఆసియా కప్ 2023 ఫైనల్‌లో సౌత్ కొరియాపై 2-1 తేడాతో భారత జట్టు విజయం సాధించింది. భారత మహిళా జట్టు ఆట మొదలైన తర్వాత 22వ నిమిషంలో టీమిండియా తరుపున అన్ను మొదటి గోల్ సాధించి, టీమ్‌కి 1-0 ఆధిక్యం అందించింది. ఆ తరువాత ఆట 25వ నిమిషంలో సౌత్ కొరియా ప్లేయర్ సియోన్ పార్క్ గోల్ చేయడంతో స్కోర్లు 1-1 తేడాతో సమం అయ్యాయి. ఆట 41వ నిమిషంలో టీమిండియా ప్లేయర్ నీలమ్ గోల్ చేసి భారత్‌కి 2-1 ఆధిక్యం అందించింది. చివరి వరకూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత మహిళా హాకీ జట్టు 2023 ఉమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్ ను సొంతం చేసుకుంది.
భారత మహిళా హాకీ జట్టుకి ఇదే మొట్టమొదటి జూనియర్ ఆసియా కప్. ఫైనల్‌లో భారత్ చేతుల్లో ఓడిన సౌత్ కొరియా ఇప్పటికే నాలుగు సార్లు ఛాంపియన్‌షిప్ గెలిచింది. హాకీ జూనియర్ ఆసియా కప్ 2023 టోర్నీలో పురుషుల, మహిళల టైటిల్స్ రెండూ కూడా భారత్ కే దక్కాయి. జూనియర్ ఆసియా కప్ గెలిచిన భారత మహిళల హాకీ టీమ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.