విశ్వక్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకెళ్తోంది. సమష్టి కృషితో పతకంపై ఆశలు రెకెత్తిస్తోంది. తాజాగా 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించింది. కీలక క్వార్టర్ ఫైనల్లో 3-1 గోల్స్ తేడాతో బ్రిటన్‌పై నెగ్గి సెమీస్‌కు చేరింది. కాగా, అసాధారణ రీతిలో ఒలింపిక్స్ హాకీలో 8 స్వర్ణాలు గెలిచిన భారత్.. చివరిసారి 1980లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు మరో పతకం గెలవలేదు. అయితే గత అయిదేళ్లలో మెరుగైన భారత్ ఆట తీరు.. టోక్యోలో పతకంపై ఆశలు రేపుతోంది.
మ్యాచ్ తొలి క్వార్టర్‌లో ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోల్ చేయగా.. రెండో క్వార్టర్‌లో 16వ నిమిషంలో గుర్జత్‌సింగ్ మరో గోల్ సాధించాడు. దీంతో మ్యాచ్ విరామ సమయానికి భారత్ 2-0 గోల్స్ ఆధిక్యంతో కొనసాగింది. 45వ నిమిషంలో బ్రిటన్ తొలి గోల్ చేసింది. దీంతో మూడో క్వార్టర్ పూర్తయ్యేసరికి బ్రిటన్ ఒక గోల్ చేసి స్కోర్ 2-1గా మార్చింది. నాలుగో క్వార్టర్‌లో 57వ నిమిషంలో హార్దిక్ సింగ్ మూడో గోల్ చేసి భారత్ జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. తాజా ప్రదర్శనతో 41 ఏళ్ల తర్వాత భారత్ సెమీ ఫైనల్‌కు చేరింది.