ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్‌.. రెండో టెస్టులో ఘ‌న విజ‌యం.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్‌

India beat England by 317 runs to level series 1-1.చెన్నైలోని చెపాక్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 317 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారీ విజ‌యాన్ని సాధించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2021 7:48 AM GMT
India beat England by 317 runs to level series 1-1

చెన్నైలోని చెపాక్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 317 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారీ విజ‌యాన్ని సాధించింది. ఈ విజ‌యంతో తొలి టెస్టులో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంతో పాటు నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 స‌మం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 482 ప‌రుగుల భారీ విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 164 పరుగుల‌కే కుప్ప‌కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసిన అక్ష‌ర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ప‌త‌నంలో కీల‌క పాత్ర పోషించగా.. అశ్విన్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 329, రెండో ఇన్నింగ్స్‌లో 286 ప‌రుగులు చేసి ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 134, రెండో ఇన్నింగ్స్‌లో 164 ప‌రుగులు చేసింది.

53/3 ఓవ‌ర్‌నైట్ స్కోర్‌ల‌తో నాలుగోరోజు మంగ‌ళ‌వారం ఆటను కొన‌సాగించిన ఇంగ్లాండ్ మ‌రో 111 ప‌రుగులు చేసి మిగ‌తా ఏడు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే లారెన్స్‌(26)ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. కెప్టెన్ జోరూట్ (33; 92 బంతుల్లో 3 పోర్లు) వికెట్ కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఓ ప‌క్క జో రూట్ నిలిచిన‌ప్ప‌టికి మ‌రో ప‌క్క ఇంగ్లాండ్ వికెట్లు కోల్పోయింది. బెన్‌స్టోక్స్ (8), ఓలీపోప్ (12), బెన్ ఫోక్స్‌(2) వెంట వెంట‌నే ఔట‌య్యారు. దీంతో భోజ‌న‌విరామానికి ఇంగ్లాండ్ 116/7తో వెళ్లింది.


లంచ్ అనంత‌రం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించ‌డానికి భార‌త్ ఎక్కువ స‌మ‌యం తీసుకోలేదు. అక్ష‌ర్ ప‌టేల్ వ‌రుస ఓవ‌ర్ల‌లో రూట్‌, స్టోన్‌ను ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ ఓట‌మికి ఖాయ‌మైంది. ఈ ద‌శ‌లో మొయిన్ అలీ 18 బంతుల్లో పోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 43 ప‌రుగులు చేసి బ్రాడ్ తో క‌లిసి ప‌దో వికెట్ కు 38 పరుగులు చేసి భారత విజ‌యాన్ని కాస్త ఆల‌స్యం చేశాడు. అత‌డిని కుల్‌దీప్ పెవిలియ‌న్ చేర్చ‌డంతో భార‌త్ 317 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది.

రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీతో పాటు మొత్తం 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు) తీసిన ర‌విచంద్ర‌న్ అశ్విన్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ల‌భించింది. ఇక ఇరుజ‌ట్ల మ‌ధ్య మూడో టెస్టు మ్యాచ్ అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 24 నుంచి ప్రారంభం కానుంది.
Next Story
Share it