ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన రెండో టెస్టు.. టీమ్ఇండియా విజ‌యం

India beat Bangladesh by 3 wickets sweep series 2-0.బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా విజ‌యం సాధించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2022 12:32 PM IST
ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన రెండో టెస్టు.. టీమ్ఇండియా విజ‌యం

ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తో క్లీన్ స్వీప్ చేసింది. ఫ‌లితంగా వ‌న్డే సిరీస్‌ ఓట‌మికి ఘ‌నంగా ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్లైంది. రెండో మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలుపులో కీల‌క పాత్ర పోషించిన అశ్విన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 'అవార్డు ల‌భించ‌గా టెస్టు సిరీస్‌లో రాణించిన పుజారాకు 'ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ 'అవార్డు ద‌క్కింది.

ఓవ‌ర్ నైట్ స్కోర్ 45/4 తో నాలుగో రోజు ఆట ఆరంభించిన టీమ్ఇండియాకు క‌ష్టాలు త‌ప్ప‌లేదు. నైట్ వాచ్‌మెన్ జ‌య్‌దేవ్ ఉన‌ద్క‌త్‌(13), అక్ష‌ర్ ప‌టేల్‌(34) ల‌తో పాటు తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన పంత్(9) స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్‌కు చేరారు. దీంతో టీమ్ఇండియా 74 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో బంగ్లా గెలుపు ఖాయం అని అనిపించింది. భార‌త అభిమానుల్లో క‌ల‌వ‌రం మొద‌లు కాగా.. బంగ్లా ఫ్యాన్స్ ఆనందానికి అడ్డే లేకుండా పోయింది.

అయితే.. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా పోరాడారు మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(29), సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(42) లు. శ్రేయ‌స్ అయ్య‌ర్ క్రీజులో పాతుకుపోగా అశ్విన్ త‌న అనుభ‌వాన్ని ఉప‌యోగించి ఒత్తిడిని అధిగ‌మిస్తూ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు అభేధ్యంగా 71 ప‌ర‌గులు జోడించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో మిరాజ్ 5 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ష‌కీబ్ 2 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227కు ఆలౌట్ కాగా.. టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 314 ప‌రుగులు చేసింది. అనంత‌రం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాకు ల‌భించిన 87 ప‌రుగుల ఆధిక్యాన్ని తీసివేయ‌గా 145 ప‌రుగుల ల‌క్ష్యం భార‌త్ ముందు నిలిచింది.

Next Story