టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మహిళల జట్టు పోరాడింది. రెండో క్వార్టర్‌లో భారత జట్టులోని గుర్జీత్ కౌర్ 22వ నిమిషం వద్ద గోల్ చేసింది. ఒక్క గోల్ కూడా చేయనివ్వకుండా ఆసీస్‌ను భారత్ నిలువరించింది. మూడుసార్లు ఒలింపిక్స్ ఛాంపియన్ గా నిలిచిన ఆసీస్‌ను ఓడించడం టోర్నీకి హైలైట్ గా నిలిచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఆసీస్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భారత్ ఆడింది. ఆస్ట్రేలియా మహిళల జట్టుపై 1-0 తేడాతో భారత్ గెలిచింది.
1980 తర్వాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్ లో మళ్లీ అంతటి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు 4వ స్థానంలో నిలిచింది. గుర్జీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో భారత్‌కు తొలి, ఏకైక గోల్‌ను అందించింది. బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా చేయకుండానే నిష్క్రమించడం గమనార్హం. ఇక క్వార్టర్స్‌కు ముందు పూల్ 'ఎ'లో భారత్ లీగ్ దశలో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిలో ఓడింది. ఏడు గోల్స్ చేసి, 14 గోల్స్ సమర్పించుకుంది. ఇక పూల్ 'బి'లో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సంగతి తెలిసిందే.