మాయ చేసిన చ‌హ‌ల్, న‌టరాజ‌న్‌.. బోణి కొట్టిన భార‌త్‌

India Beat Australia In First T20. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచులో భార‌త్ విజ‌యం

By Medi Samrat  Published on  4 Dec 2020 1:21 PM GMT
మాయ చేసిన చ‌హ‌ల్, న‌టరాజ‌న్‌.. బోణి కొట్టిన భార‌త్‌

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచులో భార‌త్ విజ‌యం సాధించింది. 162 పరుగుల విజ‌య లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 150 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమ్ఇండియా 11 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ల‌ను ఆరంగేట్ర పేసర్ నటరాజన్ వణికించగా.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ తన మాయాజాలంతో కట్టడి చేశాడు. ఇద్దరూ చెరో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత్‌ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని చేదించ‌డానికి బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు ఆర్కీ షార్ట్‌ (34; 38 బంతుల్లో 3పోర్లు), ఆరోన్‌ ఫించ్‌ (35; 26 బంతుల్లో 5పోర్లు, 1సిక్స్‌) తొలి వికెట్‌కు 56 ప‌రుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. 8వ ఓవర్‌ నాల్గో బంతికి ఫించ్‌ను‌ ఔట్‌ చేసిన చహల్‌..10వ ఓవర్‌ ఐదో బంతికి స్టీవ్‌ స్మిత్‌ (12) పెవిలియన్‌కు పంపి ఆసీస్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చాడు. ఆ త‌రువాత న‌ట‌రాజన్ పుల్‌ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ ‌(2), డీఆర్సీ షార్ట్‌లను తన వేర్వేరు ఓవర్లలో పెవిలియ‌న్ చేర్చ‌డంతో మ్యాచ్ టీమ్ఇండియా చేతిలోకి వ‌చ్చింది. ఆ తరువాత హెన్రిక్స్ (30; 20బంతుల్లో 1పోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించినా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. చివ‌ర‌ల్లో అబాట్(12), స్వెప్స‌న్ (12) ధాటిగా ఆడి ఓట‌మి అంత‌రాన్ని త‌గ్గించారు.

అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఇండియాను బ్యాటింగ్‌కు టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (1) త్వరగానే పెవిలియన్ చేర‌గా.. వన్‌డౌన్‌లో వ‌చ్చిన కోహ్లీ (9)తో కలిసి కేఎల్ రాహుల్‌(51; 40 బంతుల్లో 5పోర్లు, 1సిక్స్‌) వేగంగా పరుగులు సాధించడంతో పవర్‌ప్లేలో భారత్‌ 42 పరుగులు సాధించింది. ఈ ద‌శ‌లో ఆసీస్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ వేయ‌డంతో.. భార‌త్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. కోహ్లీ, సంజు శాంసన్‌ (23; 15 బంతుల్లో, 1పోర్‌, 1సిక్స్‌), మ‌నీష్ పాండే(2), కేఎల్ రాహుల్ ల‌ను ఆసీస్ బౌల‌ర్లు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పెవిలియ‌న్ చేర్చారు. దీంతో ఆసీస్ 92 ప‌రుగుల‌కే అయిదు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. హార్దిక్‌ పాండ్యా (16; 15 బంతుల్లో 1సిక్స్‌) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయాడు. చివరలో రవీంద్ర జడేజా (44; 23 బంతుల్లో, 5పోర్లు, 1సిక్స్‌) విధ్వంసం సృష్టించడంతో..ఆసీస్ ముందు మెరుగైన ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.
Next Story
Share it