ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్.. బాక్సింగ్‌డే టెస్టులో ఘ‌న విజ‌యం

India Beat Australia In Boxing Day Test. తొలి టెస్టులో ఎదురైన ఘోర ప‌రాభ‌వానికి టీమ్ఇండియా ప్ర‌తీకారం తీర్చుకుంది.

By Medi Samrat  Published on  29 Dec 2020 4:17 AM GMT
ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్.. బాక్సింగ్‌డే టెస్టులో ఘ‌న విజ‌యం

తొలి టెస్టులో ఎదురైన ఘోర ప‌రాభ‌వానికి టీమ్ఇండియా ప్ర‌తీకారం తీర్చుకుంది. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రెండో వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేదించింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కెప్టెన్‌ అజింక్యా రహానే (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ (36 బంతుల్లో 35; 7 ఫోర్లు) రాణించ‌డంతో భార‌త్ 15.5 ఓవ‌ర్ల‌లోనే విజ‌యాన్ని అందుకుంది. వీరిద్ద‌రు అభేద్య‌మైన మూడో వికెట్‌కు 52 ప‌రుగులు జోడించి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు.

అంత‌క‌ముందు ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్(5), న‌యా వాల్ పుజారా(3) మ‌రోసారి విఫ‌లం కావ‌డంతో.. 16 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. దీంతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లాగా మ‌రోసారి భార‌త్ కుప్ప‌కూలుతుంద‌న్న ఆందోళ‌న నెల‌కొంది. కానీ కెప్టెన్ ర‌హానే, అరంగ్రేటం ఆట‌గాడు గిల్ చ‌క్క‌ని బ్యాటింగ్‌తో భార‌త్‌కు విజ‌యాన్ని అందించారు. తాజా విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-1 తో సమం చేసింది.

అంత‌క‌ముందు ఓవ‌ర్‌నైట్ స్కోర్ ఆరు వికెట్ల న‌ష్టానికి 133 ప‌రుగుల‌తో నాలుగో రోజు ఆట‌ను ఆరంభించిన ఆసీస్ మ‌రో 67 ప‌రుగులు జోడించి చివ‌రి నాలుగు వికెట్లను కోల్పోయింది. గ్రీన్ (45), పాట్ క‌మిన్స్‌(22) కాసేపు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు. వీరిద్ద‌రూ ఏడో వికెట్‌కు 57 ప‌రుగులు జోడించారు. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని బుమ్రా విడ‌దీశాడు. బుమ్రా బౌలింగ్‌లో క‌మిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను మ‌యాంక్ చ‌క్క‌గా అందుకున్నాడు. మ‌రో 21 ప‌రుగుల త‌రువాత సిరాజ్ బౌలింగ్‌లో గ్రీన్ ఔట్ అయ్యాడు. ఆ త‌రువాత వ‌చ్చిన ల‌య‌న్‌(3), హెజిల్‌వుడ్ (10), మిచెల్ స్టార్క్ (14) వెంట‌వెంట‌నే ఔట్ చేయ‌డంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 200 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్ 3, బుమ్రా, అశ్విన్, జ‌డేజా 2, ఉమేశ్ యాద‌వ్ 1 వికెట్ ప‌డ‌గొట్టాడు.


Next Story