రెండో టెస్టులో భార‌త్‌ ఘ‌న విజ‌యం

India beat Australia by six wickets.ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2023 8:52 AM GMT
రెండో టెస్టులో భార‌త్‌ ఘ‌న విజ‌యం

ఢిల్లీ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 ప‌రుగులు చేయ‌గా భార‌త్ 262 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు ఒక్క ప‌రుగు ఆధిక్యం ల‌భించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూల‌గా.. భార‌త్ ముందు 115 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యం నిలిచింది. ఈ ల‌క్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది టీమ్ఇండియా. మిగిలిన రెండు టెస్టుల్లో ఒక్క మ్యాచులో విజ‌యం సాధించినా స‌రే టీమ్ఇండియా ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ కు దూసుకువెలుతుంది.

తొలి రెండు రోజులు ఆసీస్‌, భార‌త్‌లు పోటాపోటీగా ఆడాయి. అయితే.. మూడో రోజు తొలి సెష‌న్‌లో టీమ్ఇండియా అద్భుతంగా పుంజుకుంది. ముఖ్యంగా జ‌డేజా 7 వికెట్లు తీసి ఆసీస్ ప‌త‌నంలో కీల‌క పాత్ర పోషించాడు. జ‌డేజాతో పాటు అశ్విన్ విజృంభించ‌డంతో ఓవ‌ర్ నైట్ స్కోర్ ఒక వికెట్ న‌ష్టానికి 61 ప‌రుగుల‌తో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

115 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమ్ఇండియాకు ఆరంభంలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. పేల‌వ ఫామ్ ను కొన‌సాగించిన రాహుల్ ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ చేరుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(31; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడాడు. అయితే.. పుజారా(31 నాటౌట్‌)తో స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా ర‌నౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ(20)తో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లాడు పుజారా. అయితే.. భారీ షాట్ ఆడే క్ర‌మంలో టెస్టు కెరీర్‌లో తొలి సారి విరాట్ కోహ్లీ స్టంపౌట్ అయ్యాడు. శ్రేయాస్‌(12) విఫ‌లం అయిన‌ప్ప‌టికీ శ్రీక‌ర్ భ‌ర‌త్‌(23 నాటౌట్‌)తో క‌లిసి భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు పుజారా.

వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న పుజారా విన్నింగ్ షాట్‌ను కొట్ట‌డం విశేషం.


Next Story