టెస్ట్ సిరీస్ లను పలు జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోడానికి ముఖ్య కారణం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్. టెస్ట్ విభాగంలో ఐసీసీ ట్రోఫీని దక్కించుకోవాలని ప్రతి జట్టు కూడా భావిస్తూ ఉంటుంది. ఈసారి ఫైనల్ రేసులో భారత్ దూసుకు వెళుతోంది. ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ రెండున్నర రోజుల్లోముగిసింది. భారత్ రెండో టెస్టులో ఆసీస్ ను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆటకు మూడో రోజున 115 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 26.4 ఓవర్లలో 4 వికెట్లకు 118 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు మరింత దగ్గరైంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ కు ముందు భారత్ విన్నింగ్ పర్సంటేజ్‌ను 61.67 నుంచి 64.06కు పెంచుకుని, డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పుడు ఆసక్తికర విషయం ఏమిటంటే రెండో బెర్తు కోసం ఆసీస్-శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది. తాజా ఓటమితో ఆసీస్ విన్నింగ్ పర్సంటేజ్ 70.83 నుంచి 66.67 శాతానికి పడిపోవడంతో శ్రీలంక (53.33) ఆశలు సజీవంగా మారాయి. ఈ సిరీస్ లో కంగారూలు క్లీన్ స్వీప్ (0-4) భారత్ చేతిలో ఓడిపోతే.. ఆ తర్వాత జరిగే సిరీస్‌లో శ్రీలంక.. న్యూజిలాండ్‌ను 2-0 తేడాతో చిత్తు చేస్తే, ఆసీస్ కు ఫైనల్ అవకాశం ఉండదు. భారత్‌తో పాటు శ్రీలంక ఫైనల్‌కు చేరుతుంది. అయితే న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం శ్రీలంకకు చాలా కష్టం. కివీస్-శ్రీలంక సిరీస్ మార్చి 9 నుంచి మొదలవుతుంది.