సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దు కాగా.. మూడో రోజు ఆటను ఆరంభించిన భారత్ మరో 55 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 6 వికెట్లు పడగొట్టగా, రబాడా 3 వికెట్లు, మార్కో జాన్సెన్ ఒక్క వికెట్ తీశారు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి 272/3 తో పటిష్టమైన స్థితిలో ఉన్న భారత్ మూడో రోజు ఆటలో తీవ్ర ఇబ్బందులు పడింది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేస్తుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు సత్తా చాటారు. సెంచరీ హీరో కేఎల్ రాహుల్(123) ఒక్క పరుగు మాత్రమే జోడించి రబాడ బౌలింగ్‌లో ఔటైయ్యాడు. ఇక కుదురుకున్నట్లుగానే కనిపించిన అజింక్యా రహానే అర్థశతకానికి రెండు పరుగుల దూరంలో పెవిలియన్ చేశాడు. ఆ తర్వాత భారత్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. ఒక్కరు కూడా క్రీజులో కుదురుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. రిషబ్ పంత్ 8, రవిచంద్రన్ అశ్విన్ 4, శార్దూల్ ఠాకూర్ 4, మహ్మద్ షమీ 8, బుమ్రా 14, సిరాజ్ 4 నాటౌట్ పరుగులు చేశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు స్కోరు 2 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్(1) పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. మరో ఓపెనర్ ఎయిడెన్ మార్కరమ్(9నాటౌట్)కు జత కలిసిన కీగన్ పీటర్సన్(11) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం లంచ్ విరామానికి దక్షిణాఫిక్రా స్కోర్ 21/1.