విరాట్ ఒంటరి పోరు.. బౌలర్లు ఏం చేస్తారో..?
India all out for 223 after skipper Kohli's 79.నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 12 Jan 2022 11:32 AM ISTనిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. బ్యాట్స్‌మెన్లు మూకుమ్మడిగా విఫలం కావడంతో టీమ్ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడే 79 పరుగులతో రాణించినా.. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో తక్కువ పరుగులకే టీమ్ఇండియా కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్‌క్రమ్(8), కేశవ్ మహరాజ్(6) క్రీజులో ఉన్నారు. పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై రెండో రోజు భారత బౌలర్లు ఎలా రాణిస్తారో వేచి చూడాల్సిందే.
మబ్బులు పట్టిన వాతావరణంలో, పచ్చిక ఉన్న పిచ్‌పై టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న సౌతాఫ్రికా పేసర్లు రబాడ, అలివీర్ పేస్, బౌన్స్‌తో భారత బ్యాట్స్‌మెన్లకు పెద్ద పరీక్షే పెట్టారు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(15), కేఎల్ రాహుల్ (12) లను తొందరగానే పెవిలియన్‌కు చేర్చారు. 33 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(79; 201 బంతుల్లో 12ఫోర్లు, 1సిక్స్), నయా వాల్ పుజారా(43; 77బంతుల్లో 7 పోర్లు) జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కోహ్లీ ఓ వైపు క్రీజులో పాతుకుపోగా.. పుజారా తన శైలికి భిన్నంగా గత మ్యాచ్‌లో ఆడినట్లుగానే వేగంగా పరుగులు చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఈ జంటను జాన్సన్ విడగొట్టాడు.
పుజారా ఔటైన తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్లు వచ్చినట్లుగానే పెవిలియన్ చేరారు. రహానె(9) మరోసారి ఘోరంగా విఫలం కాగా.. పంత్(27) ఫర్వాలేదనిపించాడు. అశ్విన్(2), శార్ధూల్ ఠాకూర్(12), బుమ్రా(0), షమీ(7) ఔట్‌కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 4, మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీశారు. ఒలీవియర్, ఎంగిడి, మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు.