జో రూట్ సంచ‌ల‌న బౌలింగ్‌.. 145 ప‌రుగుల‌కే టీమ్ఇండియా ఆలౌట్‌

India all out for 145 in 3rd test.పింక్ బాల్ టెస్టులో టీమ్ఇండియా అనూహ్యంగా త‌డ‌బ‌డింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2021 4:14 PM IST
జో రూట్ సంచ‌ల‌న బౌలింగ్‌.. 145 ప‌రుగుల‌కే టీమ్ఇండియా ఆలౌట్‌

పింక్ బాల్ టెస్టులో టీమ్ఇండియా అనూహ్యంగా త‌డ‌బ‌డింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సంచ‌ల‌న బౌలింగ్‌తో టీమ్ఇండియా 150 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 99/3 తో రెండో రోజు ఆట కొన‌సాగించిన భార‌త్ మ‌రో 46 ప‌రుగుల‌కే మిగిలిన ఏడు వికెట్ల‌ను కోల్పోయింది. భార‌త బ్యాట్స్‌మెన్ల‌లో రోహిత్ శ‌ర్మ ఒక్క‌డే 66ప‌రుగుల‌తో రాణించాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జో రూట్ ఐదు వికెట్లతో రాణించ‌గా.. జాక్ లీచ్ నాలుగు, జోప్రా ఆర్చ‌ర్ ఒక‌ వికెట్ ప‌డ‌గొట్టారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో.. భార‌త్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 33 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ద‌క్కింది.

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోర్ మూడు వికెట్ల న‌ష్టానికి 99 ప‌రుగుల‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేప‌టికే భార‌త్ వికెట్ కోల్పోయింది. లీచ్ బౌలింగ్‌లో అజింక్య ర‌హానే (7) ఎల్బీగా పెవిలియ‌న్ చేరాడు. దీంతో 114 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మ‌రికాసేప‌టికే రెండు బౌండ‌రీలు బాది ఊపుమీదున్న రోహిత్ శ‌ర్మ సైతం లీచ్ ఎల్చీగా ఔట్ చేశాడు. దీంతో భార‌త్ 115 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఇక ఇక్క‌డి నుంచి ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాయ మొద‌లైంది. ఆదుకుంటాడు అనుకున్న పంత్ (1) తో పాటు వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(0), అక్ష‌ర్ ప‌టేల్‌(0), అశ్విన్‌(17), బుమ్రా(1)ల‌ను ఔట్ చేయ‌డంతో భార‌త్ తొలి ఇన్నింగ్స్ 145 ప‌రుగుల వ‌ద్ద ముగిసింది.


Next Story