అదే టెన్షన్ పెడుతున్న అంశమని అంటున్న దిలీప్ వెంగ్ సర్కార్
India a better side going into World Test Championship final. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
By Medi Samrat Published on 7 Jun 2021 8:46 AM IST
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 18న ఫైనల్ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. అయితే గత కొద్దిరోజులుగా క్వారెంటైన్ లో ఉండడం.. ఫైనల్ మ్యాచ్ కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం.. భారత్ ను కలవరపెడుతోంది. భారత క్రికెట్ లెజెండ్ దిలీప్ వెంగ్ సర్కార్ కూడా ఈ విషయాన్నే బయటపెట్టారు. భారత క్రికెట్ జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మంచి ఫామ్ లోనే ఉన్నారని.. కానీ మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడంతో వారు ఫైనల్ లో కాస్త తడబడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
కోహ్లీ బ్యాటింగ్ గురించి అందరికీ తెలుసునని.. సమకాలీన క్రికెటర్లలో కోహ్లీ బెస్ట్ ప్లేయర్ అని అన్నారు. కోహ్లీ, విరాట్ లాంటి వాళ్లు వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు.. తమ ప్రదర్శనతో భారత్ కు ఎన్నో విజయాలను అందించారు. అయితే అతి ముఖ్యమైన మ్యాచ్ కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వారి ప్రదర్శనపై ప్రభావం చూపించే అవకాశం ఉందని వెంగ్ సర్కార్ మీడియాతో ఆదివారం నాడు చెప్పుకొచ్చారు. వారిద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారన్నది అందరికీ తెలిసిందే.. అది శుభపరిణామం కూడా..! కానీ మ్యాచ్ ప్రాక్టీస్ అన్నది చాలా ముఖ్యమని అన్నారు.
న్యూజిలాండ్ జట్టు మాత్రం చాలా తెలివిగా ఆలోచించిందని.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ముందే ఇంగ్లండ్ గడ్డపై రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడుతోందని వెంగ్ సర్కార్ చెప్పారు. అదే న్యూజిలాండ్ కు మంచి చేస్తుందని.. ఈ విషయంలో భారత్ కంటే కాస్త అడ్వాంటేజ్ న్యూజిలాండ్ కే ఉందని వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డారు. ఇండియా కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ముందు మ్యాచ్ ప్రాక్టీస్ చేసి ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. భారత బౌలింగ్ యూనిట్ కు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ ఫైనల్ ముందు సహాయపడేదని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చారు.