టీమ్ఇండియాకు షాక్‌.. ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలవ‌లేదు.. ఏడు వికెట్లు డౌన్‌

ఇండోర్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా బ్యాట‌ర్లు త‌డ‌బ‌డుతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2023 12:02 PM IST
India vs Australia 3rd Test,  Indore Test, Team india 1st innings

India vs Australia 3rd Test

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో వ‌రుస‌గా రెండు టెస్టులో విజ‌యం సాధించి మంచి జోరు మీదున్న భార‌త్ ఇండోర్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో త‌డ‌బ‌డుతోంది. ఆసీస్ బౌల‌ర్ల ధాటికి తొలి రోజు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఏడు వికెట్ల న‌ష్టానికి 84 ప‌రుగులు చేసింది. ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ 6, అశ్విన్ 1 ప‌రుగుతో క్రీజుతో ఉన్నారు.

టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గ‌త కొంత‌కాలంగా ఫామ్ లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ పై వేటు ప‌డింది. అత‌డి స్థానంలో శుభ్‌మ‌న్ గిల్‌ను తీసుకున్నారు.

క‌నీసం ఈ టెస్టులోనైనా భార‌త ఓపెన‌ర్లు శుభారంభం అందిస్తారు అనుకుంటే అది జ‌ర‌గ‌లేదు. ఆసీస్ స్పిన్న‌ర్ల ధాటికి టీమ్ఇండియా బ్యాట‌ర్లు పెవిలియ‌న్ క్యూ క‌ట్టారు. తొలి వికెట్‌కు 27 ప‌రుగులు జోడించిన త‌రువాత‌ రోహిత్ శ‌ర్మ‌(12) స్టంపౌట్ అయ్యాడు. ఇక్క‌డి నుంచి మొద‌లైంది వికెట్ల ప‌త‌నం. ఒక్క‌రు కూడా క్రీజులో నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నించ‌లేదు. మ‌రో ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌(21)తో పాటు పుజారా(1), ర‌వీంద్ర జ‌డేజా(4), శ్రేయస్ అయ్య‌ర్‌(0), విరాట్ కోహ్లీ(22), శ్రీక‌ర్ భ‌ర‌త్(17)లు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయారు. దీంతో టీమ్ఇండియా లంచ్ బ్రేక్ స‌మ‌యానికే ఏడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. గ‌త టెస్టులో మాదిరిగానే ఈ సారి కూడా అక్ష‌ర్ ప‌టేల్‌, అశ్విన్‌లు ఆదుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Next Story