పట్టువిడిచిన బౌలర్లు.. ఇక భారమంతా బ్యాట్స్‌మెన్ల దే
India 43/0 at stumps trail by 56 runs.బౌలర్లు మళ్లీ అదే తప్పు చేశారు. టాప్ ఆర్డర్‌ను తొందరగానే పెవిలియన్ చేర్చి
By తోట వంశీ కుమార్ Published on 4 Sept 2021 8:05 AM ISTబౌలర్లు మళ్లీ అదే తప్పు చేశారు. టాప్ ఆర్డర్‌ను తొందరగానే పెవిలియన్ చేర్చినా.. తోకను తెంచలేక ప్రత్యర్థి జట్టుకు విలువైన ఆధిక్యాన్ని అప్పగించేశారు. ఓ దశలో ఇంగ్లాండ్ 62/5 నిలిచినా చివరికి 290 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 99 పరుగుల కీలక ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్.. రెండో రోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(20), రాహుల్(22) పరుగులతో క్రీజులో ఉన్నారు. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై మూడో రోజంతా భారత బ్యాట్స్‌మెన్లు నిలిస్తే తప్ప మ్యాచ్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే.
అంతకముందు ఓవర్‌నైట్ స్కోరు 53/3తో రెండో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ కు ఉమేష్ యాదవ్ గట్టి షాకే ఇచ్చాడు. ఓవర్టన్ (1), మలన్ (31) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. దీంతో 62/5 తో ఇంగ్లండ్ కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే.. సిరీస్‌లో తొలిసారి అవకాశం దక్కించుకున్న ఒలీ పోప్ (81) భారత ఆశలపై నీళ్లు చల్లాడు. బెయిర్ స్టో(37) మొయిన్ అలీ(35), క్రిస్ వోక్స్ (50)లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాలు అందించాడు. బెయిర్ స్టోతో ఆరో వికెట్‌కు 89పరుగులు, మొయిన్ అలీతో కలిసి ఏడో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. సెంచరీ చేసేలా కనిపించిన పోప్‌ను శార్దూల్ బుట్టలో వేసుకున్నాడు. చివరల్లో క్రిస్ వోక్స్ బౌండరీలతో విరుచుకుపడి ఇంగ్లండ్ ఆధిక్యాన్ని వందకు చేరవ చేశాడు. చివరికి బై తీయబోయి వోక్స్ రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్‌ఇండియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (20), కేఎల్ రాహుల్ (22) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 56 పరుగులు వెనుక బడి ఉంది. మూడో రోజంతా భారత బ్యాట్స్‌మెన్లు అసాధారణంగా పోరాడిల్సిందే. లేదంటే సిరీస్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే.