విండీస్‌తో రెండో టీ20 నేడే.. రోహిత్‌ను ఊరిస్తున్న ప్ర‌పంచ రికార్డు

IND vs WI 2nd T20 match today.వెస్టిండీస్ జ‌ట్టుతో మ‌రో పోరుకు సిద్ద‌మైంది టీమ్ఇండియా. సెయింట్ పార్క్ వేదిక‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2022 9:05 AM GMT
విండీస్‌తో రెండో టీ20 నేడే.. రోహిత్‌ను ఊరిస్తున్న ప్ర‌పంచ రికార్డు

వెస్టిండీస్ జ‌ట్టుతో మ‌రో పోరుకు సిద్ద‌మైంది టీమ్ఇండియా. సెయింట్ పార్క్ వేదిక‌గా నేడు ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిలకడకు దినేశ్‌ కార్తీక్‌ మెరుపులు తోడవడంతో సునాయాసంగా గెలుపొందిన టీమ్‌ఇండియా రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొన‌సాగించాల‌ని చూస్తుండ‌గా.. తొలి మ్యాచ్‌లో ఎదురైన ప‌రాభ‌వానికి ఈ మ్యాచ్‌లో ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని కరేబీయ‌న్లు బావిస్తున్నారు.

ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం తుది జట్టును ఎంపిక చేసేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని భారత మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో ప‌లు ప్ర‌యోగాలు చేస్తోంది. గత మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన సూర్యకుమార్‌ మరోసారి ఓపెనర్‌గా వచ్చే అవకాశాలున్నాయి. తొలి మ్యాచ్‌లో డ‌కౌట్ అయిన శ్రేయ‌స్ అయ్య‌ర్ స్థానంలో దీప‌క్ హుడాను తీసుకోవచ్చు. తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ పంత్ స్థానానికి వ‌చ్చిన ఢోకా ఏమీ లేదు. రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌ రూపంలో జట్టులో కావాల్సినంత మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు నయా సంచలనం అర్శ్‌దీప్‌ అదుర్స్‌ అనిపిస్తున్నాడు. అశ్విన్‌, జడేజా, బిష్ణోయ్‌ స్పిన్‌ బాధ్యతలు మోయనున్నారు.

రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు

టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. నేటీ మ్యాచ్లో రోహిత్‌ మరో 57 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ 129 మ్యాచుల్లో 3443 పరుగులు చేశాడు. ప్ర‌స్తుతం రోహిత్ ఉన్న ఫామ్ ప్ర‌కారం ఈ మ్యాచ్‌లోనే ఈ రికార్డును అందుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

Next Story
Share it