పసికూన చేతిలో టీమిండియా ఘోర పరాజయం.. టోర్నీ నుంచి ఔట్..!
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో నవంబర్ 8న భారత్-కువైట్ మధ్య మ్యాచ్ జరిగింది.
By - Medi Samrat |
హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో నవంబర్ 8న భారత్-కువైట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కువైట్ 27 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కువైట్ జట్టు 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. కువైట్ తరుపున కెప్టెన్ యాసిన్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. 107 పరుగుల విజయలక్ష్యానికి సమాధానంగా టీమ్ ఇండియా 5.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 79 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమితో భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇదిలావుంటే.. నిన్న ప్రారంభమైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీని భారత జట్టు విజయంతో ప్రారంభించింది. దినేష్ కార్తీక్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం.. రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ మూడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం కురిసింది. వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ నియమాన్ని పాటించారు. దీని ప్రకారం.. పాకిస్తాన్ మూడు ఓవర్లలో 44 పరుగులు చేయాల్సి ఉంది.. అప్పటికి పాక్ స్కోరు 41 పరుగులు మాత్రమే.. దీంతో భారత్ గెలిచింది.
హాంకాంగ్ సిక్సెస్ అనేది క్రికెట్‌లో వేగవంతమైన అంతర్జాతీయ టోర్నమెంట్. ఒక్కో ఇన్నింగ్స్‌కు ఆరు ఓవర్లు.. ప్రతి జట్టు నుండి ఆరుగురు ఆటగాళ్లు ఆడతారు. ఇది మొదటిసారిగా 1992లో నిర్వహించబడింది. దీనిని ICC ఆమోదించింది. ఒక్కో మ్యాచ్ పూర్తి కావడానికి దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. వికెట్ కీపర్ కాకుండా మిగతా ఆటగాళ్లందరూ కనీసం ఒక ఓవర్ అయినా వేయాలి. ఈ సీజన్‌లో 9 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని మూడు గ్రూపులుగా విభజించారు. నాకౌట్ రౌండ్లు కూడా ఉంటాయి. ఆ నాకౌట్ రౌండ్‌లోనే ఓడి భారత్ ఇంటి బాట పట్టింది.