టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం
టీ20 ప్రపంచకప్ 2024 ఎనిమిదో మ్యాచ్‌లో గ్రూప్-ఎలో ఐర్లాండ్‌తో భారత్ తలపడింది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది.
By Medi Samrat Published on 5 Jun 2024 3:30 PM GMTటీ20 ప్రపంచకప్ 2024 ఎనిమిదో మ్యాచ్‌లో గ్రూప్-ఎలో ఐర్లాండ్‌తో భారత్ తలపడింది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 96 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత్ ప్రపంచ కప్ 2024ను విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత జట్టు 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత అర్ధశతకం సాధించాడు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ భారత పేసర్ల ముందు తలొంచారు. ఐర్లాండ్ జట్టులోని టాప్ బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. గారెత్ డెలానీ అత్యధికంగా 26 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. లోర్కాన్ టక్కర్ 10 పరుగులు, కర్టిస్ కాంఫర్ 12 పరుగులు, జాషువా లిటిల్ 14 పరుగులు చేశారు. భారత్ జట్టులో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ 2-2 వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
97 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సులువుగా ఛేదించింది. టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 5 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీకి ఇదే అత్యల్ప స్కోరు. రోహిత్ శర్మ 37 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అయితే రోహిత్ గాయపడి రిటైరయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 4 బంతుల్లో 2 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 26 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బెంజమిన్ వైట్ చెరో వికెట్ తీశారు.