ఆఖ‌రి పంచ్ ఇచ్చేనా..?

Ind vs Aus Third T20 Match. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో వ‌న్డే సిరీస్ కోల్పోయినా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీ20

By Medi Samrat  Published on  8 Dec 2020 5:40 AM GMT
ఆఖ‌రి పంచ్ ఇచ్చేనా..?

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో వ‌న్డే సిరీస్ కోల్పోయినా.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే టీ20 సిరీస్‌ను గెలిచి ప్ర‌తికారం తీర్చుకుంది టీమ్ఇండియా. కాగా.. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు సిడ్ని వేదిక‌గా జ‌రుగ‌నున్న ఆఖ‌రి మ్యాచ్‌లో గెలిచి ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త్ బావిస్తుండ‌గా.. క‌నీసం చివ‌రి మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంత ప్రేక్ష‌కుల మ‌ధ్య ప‌రువు ద‌క్కించుకోవాల‌ని ఆసీస్ ఆరాట‌ప‌డుతోంది. దీంతో నామామాత్ర‌మైన చివ‌రి టీ20 కూడా హోరా హోరిగా సాగనుంది.

హిట్‌మ్యాన్ రోహిత్‌శ‌ర్మ అందుబాటులో లేక‌పోయినా కూడా భార‌త్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌, ఆల్‌రౌండ‌ర్ హార్థిక్ పాండ్య‌లు పుల్ ఫామ్‌లో ఉండ‌డం భార‌త్‌కు క‌లిసిరానుంది. ఇక కెప్టెన్ కోహ్లీతో పాటు, మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ దావ‌న్ కూడా ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు ఆడుతున్నారు. అయితే.. శ్రేయాస్ అయ్యర్‌తో పాటు సంజుశాంస‌న్ లు ఇంత వ‌ర‌కు బ్యాట్ ఝుళిపించ‌లేదు. వీరిద్ద‌రు కూడా త‌మ స్థాయికి త‌గ్గ‌ట్లు రాణిస్తే భార‌త్‌కు తిరుగుండ‌దు. ప్ర‌ధాన పేస‌ర్లు ష‌మీ, బుమ్రా లేక‌పోయిన‌ప్ప‌టికి కూడా దీప‌క్ చాహ‌ర్‌, న‌ట‌రాజ‌న్‌, శార్దుల్ ఠాకూర్ లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా న‌ట‌రాజ‌న్ త‌న యార్క‌ర్ల‌తో పాటు క‌ట్ట‌ర్ల‌తో ఆసీస్ బ్యాట్స్‌మెన్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. చ‌హ‌ల్ దారుణంగా విప‌ల‌మ‌వుతుండ‌డం ఒక్క‌టే భార‌త్‌ను ఆందోళ‌న ప‌రుస్తుంది. చ‌హ‌ల్ కూడా గాడిలో ప‌డితే.. మ‌రోసారి కోహ్లీసేన ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేయ‌డం ఖాయం. 2016 ఆసీస్ పర్యటనలోనూ భారత్ తొలుత వన్డే సిరీస్‌ను కోల్పోయింది. కానీ ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.

ఇక ఆసీస్‌ను గాయాల బెడ‌ద వేదిస్తోంది. డేవిడ్ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్ దూరం అవ‌డంతో.. ఆ జ‌ట్టు బ్యాటింగ్ ఆర్డ‌ర్ ఘోరంగా దెబ్బ‌తింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఫించ్ బ‌రిలోకి దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. గ‌త‌మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్ మ్యాచ్ వేడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డం సానుకూలాంశం. స్మిత్‌తో పాటు మాక్స్‌వెల్‌, స్టోయినిస్ లు త‌మ స్థాయికి త‌గ్గ‌ట్లు రాణిస్తే భార‌త్‌కు క‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. సిడ్నిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్‌ల్లో ప‌రుగుల వ‌ర‌ద పార‌డంతో.. ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్ న‌మోదు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


Next Story
Share it