ఉప్పల్‌లో పాగా వేసేది ఎవరో..? నేడు ఆస్ట్రేలియాతో చివరి టీ20
IND vs AUS 3rd T20 Match Today.ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ చివరి అంకానికి చేరుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 25 Sept 2022 2:23 PM ISTఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. తొలి టీ20లో ఓటమి పాలైనప్పటికి రెండో టీ20లో పుంజుకుని విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీమ్ఇండియా. ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది భారత్. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ ముందు డిఫెండింగ్ చాంఫియన్ ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గితే అది టీమ్ఇండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు.
అచ్చొచ్చిన మైదానంలో కోహ్లీ అలరిస్తాడా...? లేక నాగ్‌పూర్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ దుమ్ములేపుతాడా..? టీమ్ ఇండియా సిరీస్ పట్టేస్తుందా..? లేక ఉత్తచేతులతో వెనుదిరుగుతుందా..? అన్న ప్రశ్నలకు నేడు భాగ్యనగరంలో బదులు లభించనుంది. దాదాపు మూడేళ్ల విరామం తరువాత ఉప్పల్ అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యం ఇస్తుండడంతో తెలుగు క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియాను ఇంకా సమస్యలు వేదిస్తున్నాయి. రోహిత్, రాహుల్, కోహ్లీ ల త్రయం కలిసికట్టుగా రాణించాన సందర్భాలు చాలా తక్కువ. ఓ మ్యాచ్‌లో మెరిసిన ఆటగాడు మరో మ్యాచ్‌లో విఫలం అవుతున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్‌లో ఆడే సూర్యకుమార్, హార్థిక్‌ల ది అదే పరిస్థితి. వీరందరిలో నిలకడ లోపించింది. ఆసియాకప్‌లో బౌలర్ల వైఫల్యంతో టీమ్‌ఇండియా భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ రాకతో బౌలింగ్ విభాగం కాస్త బలపడినట్లుగానే కనిపిస్తున్నప్పటికీ.. విరామం తరువాత వచ్చిన వీరు ఎలా రాణిస్తారు అన్న దానిపైనే మ్యాచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత మ్యాచ్‌లో నలుగురు బౌలర్లతోనే బరిలోకి దిగిన టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో ఐదుగురు ప్రధాన బౌలర్లను ఆడించొచ్చు. అదే జరిగితే పంత్ స్థానంలో భువనేశ్వర్ వచ్చే అవకాశం ఉంది. వరుసగా విఫలం అవుతున్నా చాహల్‌కు బదులు అశ్విన్ ను ఆడించొచ్చు. దీంతో ఈ మ్యాచ్‌లో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి అందరిలో ఉంది.
టీమ్ఇండియాతో పోలిస్తే ఆస్ట్రేలియా జట్టు కాస్త పటిష్టంగా ఉన్నట్లు కనబడుతోంది. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ భీకర ఫామ్‌లో ఉండగా.. గత మ్యాచ్‌లో కెప్టెన్ ఫించ్ ఫామ్‌లోకి వచ్చాడు. వీరిద్దరిని ఎంత త్వరగా పెవిలియన్‌కు చేరిస్తే అంత మంచిది. పేస్ బౌలింగ్‌లోనే ఆసీస్‌కు సమస్యలు ఉన్నాయి. గాయంతో ఎలిస్ దూరం అవ్వడం కమిన్స్, హేజిల్‌వుడ్, సామ్స్ విఫలం అవుతుండడం ఇబ్బందిగా మారింది. వీరు రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.
2018 నుంచి ఉప్పల్ మైదానంలో జరిగిన 16 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8 సార్లు చేజింగ్ టీమ్‌లు ఎనిమిది సార్లు గెలుపొందాయి. చివరగా 2019 డిసెంబర్ 6న ఉప్పల్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన ఆ పోరులో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. తొలుత విండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అనంతరం కోహ్లీ (94 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విజృంభించడంతో టీమ్‌ఇండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.